అబుదాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని నగరం అబుదాబికి సమీపంలో హిందూ దేవాలయాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఈ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా వర్ధిల్లుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. బోచాసన్వాసీ శ్రీ అక్షర్ పురుషోత్తమ్ స్వామినారాయణ్ సంస్థ (బీఏపీఎస్) ఈ దేవాలయాన్ని నిర్మించింది. ఇది అబుదాబిలో తొలి రాతి హిందూ దేవాలయం కావడం విశేషం.
భారత్, అరబ్ దేశాలు సంయుక్తంగా ఈ ఆలయాన్ని నిర్మించాయి. హిందూ మతంలోని వైష్ణవుడైన స్వామి నారాయణ సంప్రదాయానికి చెందిన బోచసన్యాసి అక్షర్ పురుషోత్తం స్వామి నారాయణ సంస్థ (బీఏపీఎస్) ఈ ఆలయాన్ని నిర్మించింది. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన భూమిలో 13.5 ఎకరాల భూమిని ముస్లిం రాజు అయిన షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బహుమతిగా ఇచ్చారని బీఏపీఎస్ ప్రతినిధి తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయానికి వాస్తు శిల్పిగా క్యాథలిక్ క్రిస్టియన్.. ప్రాజెక్ట్ మేనేజర్‌గా సిక్కు మతస్థుడు ఉన్నారు. ఫౌండేషన్ డిజైనర్ బుద్దిస్ట్ కాగా, నిర్మాణ సంస్థ పార్సీలకు చెందినది. డైరెక్టర్ జైన మతానికి చెందిన వ్యక్తి అని బీఏపీఎస్ ప్రతినిధి వెల్లడించారు.
ఈ ఆలయంలో ఏడు శిఖరాలున్నాయి. నాగరా సంప్రదాయ శైలిలో దీన్ని నిర్మించారు. ఆలయ ముందు భాగంలో విశ్వవ్యాప్త విలువలు, విభిన్న సంస్కృతుల సామరస్య కథలు, హిందూ ఆధ్యాత్మిక వేత్తలు, వారి అవతారాల వర్ణనలు ఉన్నాయి. ఈ ఆలయం ఎత్తు 108 అడుగులు, పొడవు 262 అడుగులు, వెడల్పు 180 అడుగులు. బయటి ముఖభాగంలో రాజస్థాన్ నుంచి తెచ్చిన గులాబీ ఇసుక రాయిని ఉపయోగించగా.. లోపలి భాగంలో ఇటాలియన్ పాలరాతిని ఉపయోగించారు. ఈ ఆలయంలో రెండు కేంద్ర గోపురాలున్నాయి. డోమ్ ఆఫ్ హార్మోని, డోమ్ ఆఫ్ పీస్‌గా వీటిని పేర్కొంటున్నారు. భూమి, నీరు, అగ్ని, గాలి, మొక్కలను చెక్కటం ద్వారా మానవ సహజీవనాన్ని తెలియచేశారు.
ఏ వాల్ ఆఫ్ హార్మోని.. అరబ్ ఎమిరేట్స్‌లోని అతిపెద్ద 3డీ ప్రింటెడ్ గోడలలో ఒకటి. ఆలయ నిర్మాణానికి సంబంధించిన కీలక మైలురాళ్లను వీడియో రూపంలో ఈ గోడపై ప్రదర్శిస్తారు. సామరస్యం అనే పదం 30 విభిన్న ప్రాచీన, ఆధునిక భాషల్లో రాశారు. ఆలయంలో నిర్మించిన ఏడు శిఖరాలు యూఏఈలోని ఏడు ఎమిరేట్స్‌కు ప్రతిరూపాలుగా చెప్తారు. మిడిల్ ఈస్ట్ అవార్డ్స్‌లో ఈ ఆలయం 2019 సంవత్సరానికి ఉత్తమ మెకానికల్ ప్రాజెక్ట్‌గా, 2020 సంవత్సరానికి ఉత్తమ ఇంటీరియర్ డిజైన్ కాన్సెప్ట్‌గా ఎంపికైంది. ఈ ఆలయం ఫిబ్రవరి 18 నుంచి ప్రజల సందర్శనార్థం తెరుస్తారు.