బీజింగ్, ఆగస్టు 30 : భారత్, చైనా, రష్యా సహా 26 దేశాల అగ్రనేతలు పాల్గొనే షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సదస్సుకు చైనాలోని పోర్టు నగరం తియాన్జిన్ సిద్ధమైంది. ఈ నెల 31, సెప్టెంబర్ 1 తేదీల్లో జరిగే ఈ సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు హాజరవుతున్నారు. 2018 తర్వాత మోదీ చైనాను సందర్శించడం ఇదే తొలిసారి. ఇటీవల ట్రంప్ వివిధ దేశాలపై విధించిన సుంకాలతో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అశాంతి నేపథ్యంలో ఈ ఎస్సీవో సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సుంకాల బాధకు గురైన పలు దేశాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సుంకాలతో బెదిరిస్తున్న అమెరికాకు ఈ సమావేశం ఎలాంటి సందేశం, హెచ్చరిక ఇస్తుందన్న అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎస్సీవో సమావేశానికి మూడు దేశాల అగ్రనేతలతో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకోతో పాటు కజకిస్థాన్, ఉజ్బెకిస్థాన్, ఖర్గిస్థాన్, తజికిస్థాన్ దేశాధ్యక్షులతో పాటు పరిశీలక దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, ఈజిప్ట్, కంబోడియా, బహ్రెయిన్, నాటో సభ్యదేశమైన టర్కీ దేశాల నేతలు హాజరవుతున్నాయి. 2001లో ఏర్పాటైన ఎస్సీవో ఎజెండాలో వేర్పాటువాదం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నిఘా సమాచారం పంచుకోవడం వంటివి ఉన్నాయి.