PM Modi : సైనిక ఘర్షణలతో యుద్ధాలకు పరిష్కారం లభించదని, శాంతి ఏర్పడబోదని ప్రధాని మోదీ అన్నారు. చర్చల ద్వారానే శాంతిస్థాపన సాధ్యమవుతుందని సూచించారు. రష్యా–ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాల్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా ఆపాలని ప్రధాని సూచించారు. నార్వే పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని జోనాస్ గర్ స్టోర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అ సందర్బంగా మోదీ తాజా అంతర్జాతీయ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ తీవ్రవాదాన్ని అంతం చేయాలని సూచించారు. ‘‘ప్రస్తుతం ప్రపంచం అస్థిరత, అనిశ్చితిలో ఉంది. పశ్చిమాసియా అయినా, ఉక్రెయిన్ అయినా.. ప్రపంచం అంతా సంఘర్షణ ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇండియా, యూరప్.. సత్సంబంధాల్లో కీలక దశకు చేరుకున్నాయి” అని మోదీ అన్నారు. తీవ్రవాదంపై పోరులో ఇండియాకు మద్దతుగా నిలిచినందుకు నార్వేకు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఇండియా–యూరప్ మధ్య గతంలో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై మోదీ మాట్లాడారు. ఈ నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు. రెండు దేశాల మధ్య ప్రగతికి, ఆర్థిక వృద్ధికి ఇది ఉపయోగపడుతుందని మోదీ వ్యాఖ్యానించారు.
ఎఫ్‌టీయే ద్వారా 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఇండియాలో భారీ ఉపాధి కల్పనకు అవకాశం దొరుకుతుంది. ఇండియా, నార్వే మధ్య గ్రీన్ ఎనర్జీ, సీఫుడ్, ఇన్నోవేషన్ వంటి అంశాల్లో ఒప్పందాలున్నాయి. రెండు దేశాల మధ్య వ్యాపారం పదేళ్లలో రెండింతలు పెరిగింది. మోదీ తాజా నార్వే పర్యటనలో ఇరు దేశాల మధ్య డిజిటల్ హెల్త్, రీసర్చ్, ఏఐ, హెల్త్, టెక్నాలజీ వంటి అంశాల్లో ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం మోదీ ఐదు దేశాల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. స్వీడన్లో పర్యటన పూర్తి చేసుకున్న మోదీ.. తాజాగా నార్వేలో పర్యటిస్తున్నారు.