కజన్, అక్టోబర్ 23: వివాదాలను పరిష్కరించుకునేందుకు చర్చలు, దౌత్యం మాత్రమే పరిష్కారమార్గమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. రష్యాలోని కజన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సులో మోదీ ప్రసంగించారు. ‘చర్చలు, దౌత్యానికే మా మద్దతు ఉంటుంది. యుద్ధానికి మద్దతివ్వం.’ అని ఆయన పేర్కొన్నారు. ‘వివాదాలు, ప్రతికూల వాతావరణ ప్రభావాలు, సైబర్ ముప్పు వంటి అనేక సవాళ్ల నడుమ జరుగుతున్న బ్రిక్స్ సదస్సుపై చాలా అంచనాలు ఉన్నాయి.’ అని అన్నారు. ‘ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదానికి నిధులు సమకూరకుండా అడ్డుకునేందుకు మాకు అందరి బలమైన మద్దతు కావాలి. ఈ తీవ్రమైన అంశంలో ద్వంద్వ ప్రమాణాలకు తావు లేదు’ అని బ్రిక్స్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు.
గాజాలో కాల్పులు విరమించాలి: బ్రిక్స్
గాజాలో తక్షణ, శాశ్వత కాల్పుల విరమణకు బ్రిక్స్ సదస్సు పిలుపునిచ్చింది. ఈ మేరకు ‘కజన్ డిక్లరేషన్’ చేసింది. ‘గాజా, వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ మిలిటరీ చర్యలతో ప్రజల సామూహిక హత్యలు జరుగుతున్నాయి. వెంటనే కాల్పులు విరమించడంతో పాటు ఇరు వైపులా బందీలను విడిచిపెట్టాలి’ అని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.
గస్తీ ఒప్పందానికి మోదీ, జిన్‌పింగ్ ఆమోదం
భారత్ – చైనా మధ్య శాంతియుత, సుస్థిర సంబంధాలు ఉండాలని ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ బుధవారం అంగీకరించారు. పరిపక్వత, పరస్పర గౌరవంతో సత్సంబంధాలను కొనసాగించాలని నిర్ణయించారు. ఐదేండ్ల తర్వాత బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, జిన్‌పింగ్ మధ్య 50 నిమిషాల పాటు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. తూర్పు లఢక్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి గస్తీ నిర్వహణ ఒప్పందం కుదుర్చుకున్నారు. సరిహద్దు వివాదంపై ఆగిపోయిన ప్రత్యేక ప్రతినిధుల చర్చలను మళ్లీ ప్రారంభించాలని ఇరువురు నిర్ణయం తీసుకున్నారు.