లండన్, సెప్టెంబర్ 16: కమ్యూనికేషన్ల రంగంలో ఇప్పటికే ఎంతో పురోగతి సాధించిన ప్రపంచ దేశాలు తదుపరి తరం (6జీ) వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ, మనలో చాలా మంది మొబైల్ ఫోన్లలో ఎన్నటికీ ఈ టెక్నాలజీని ఉపయోగించలేకపోవచ్చని షెఫీల్డ్ యూనివర్సిటీకి చెందిన రేడియో ఇంజినీరింగ్ నిపుణుడు ఎడ్డీ బాల్ చెప్తున్నారు. 2030 నాటికి లేదా కాస్త అటు ఇటుగా 6జీ నెట్వర్క్ అందుబాటులోకి రావచ్చని, ఈ నూతన సాంకేతికతో డౌన్లోడ్ల వేగం విపరీతంగా పెరుగుతుందని పేర్కొన్నారు. సెకనుకు 1 టెరాబైట్ల డాటాను బదిలీ చేయగలిగే 6జీ నెట్వర్క్ ప్రస్తుతం అందుబాటులో ఉన్న 5జీ నెట్వర్క్ కంటే 100 రెట్లు వేగంగా పనిచేస్తుందని, 5జీ నెట్వర్క్ ద్వారా కొన్ని సెకన్లలో పూర్తయ్యే డౌన్లోడ్.. 6జీ నెట్‌వర్క్‌తో కేవలం మిల్లీసెకన్ల వ్యవధిలోనే పూర్తవుతుందని వివరించారు. కానీ, 6జీ నెట్వర్క్ చాలా శక్తిమంతమైనదని, దీన్ని వినియోగించేందుకు చాలా శక్తి అవసరమవుతుందని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా మొబైల్ ఫోన్లు 6జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయవని, కొన్ని మొబైల్ ఫోన్లు ఈ సాంకేతికతను సపోర్ట్ చేసినప్పటికీ వాటి బ్యాటరీలు కేవలం 30 నిమిషాల్లోనే డ్రెయిన్ అయిపోతాయని వివరించారు.
స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌తో బ్యాటరీ చార్జ్ అయ్యే సరికొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బిల్డింగులు, కార్లకు అమర్చే గ్లాస్‌ల ద్వారానూ చార్జింగ్ చేయొచ్చని దక్షిణ కొరియాకు చెందిన ఉస్లాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు వివరించారు. ‘పారదర్శకత కలిగిన సోలార్ సెల్‌ను గ్లాస్‌కు అమర్చి చార్జ్ చేయొచ్చు. ఈ సోలార్ సెల్‌కు రంగు ఉండదు. ఇది అత్యంత సామర్థ్యం కలిగినది’ అని వెల్లడించారు. చార్జింగ్‌లో ఇది కీలక మార్పులు తెస్తుందన్నారు.