న్యూఢిల్లీ, ఆగస్టు 8 : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకం విధించిన తర్వాత అమెరికాలో స్థిరపడిన భారతీయులకు బియ్యం ధరలు చుక్కలు చూపించనున్నాయి. భారత దేశం నుంచి దిగుమతి అయ్యే బియ్యానికి 50 శాతం అధికంగా చెల్లించాల్సి వస్తుంది. అమెరికాలో నివసించే భారతీయులలో అత్యధికులు బియ్యం లేదా గోధుమలను తమ ఆహారంగా తీసుకుంటారు. భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యాన్ని కొనే శక్తి లేని వారు ఇక పాకిస్థాన్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంతో సరిపెట్టుకోవలసి వస్తుంది. పెరిగిన ధరలు ఆగస్టు 27 నుంచి అమలులోకి రానున్నాయి. భారత్ నుంచి ప్రతి ఏటా అమెరికాకు 2.5 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పండే సోనా మసూరీ రకం దాదాపు 40 శాతం ఉంటుంది. మిగిలిన 60 శాతం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఇతర ఉత్తరాది రాష్ర్టాలలో పండించే బాస్మతి రకం ఉంటుంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులలో అత్యధికులు సోనా మసూరీ పైనే నిత్యం ఆధారపడుతుంటారు.
బాస్మతి బియ్యాన్ని బిర్యానీ వంటి వంటకాలకు మాత్రమే ఉపయోగిస్తుంటారు. అమెరికాలో ప్రస్తుతం ఒక టన్ను సోనా మసూరీ బియ్యం ధర 900 డాలర్ల(రూ. 78,714) నుంచి 1000 డాలర్ల(రూ. 87,460) వరకు ఉంటోంది. టన్ను బాస్మతి బియ్యం 1,200 డాలర్ల (రూ.1.05 లక్షలు) నుంచి 1,300 డాలర్ల(రూ.1.14 లక్షలు) మధ్య ఉంటుంది. ట్రంప్ ప్రకటన అమలులోకి వచ్చిన తర్వాత వీటి ధరలు 50 శాతానికి పైగా పెరిగిపోయే అవకాశం ఉంది. పాకిస్థాన్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంతో పోలిస్తే భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యం అమెరికాలో చాలా ఖరీదు కానున్నది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్న భారత్‌ను లొంగదీసుకునేందుకు అమెరికాలో నివసించే భారతీయులపై ఒత్తిడి తీసుకురావడమే ట్రంప్ వ్యూహమని నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు బీవీ కృష్ణారావు హెచ్చరించారు. అయితే దీని పూర్తి ప్రభావం ఏమిటో రానున్న వారాలలో తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేశంలో బాస్మతి రకం బియ్యాన్ని అత్యధికంగా పండించే పంజాబ్ ట్రంప్ నిర్ణయం కారణంగా తీవ్రంగా నష్టపోనున్నది. ప్రస్తుతం ట్రంప్ విధించిన పన్నుల వల్ల ఒక టన్ను భారతీయ బాస్మతి బియ్యం ధర 1,200 డాలర్ల(రూ.1.05 లక్షలు) నుంచి 1,800 డాలర్లకు(రూ. 1.57 లక్షలు) పెరిగే అవకాశం ఉంది.