న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం ప్రపంచమంతా విస్తరిస్తున్నది. ముఖ్యంగా ఆగ్నేయాసియాలో ఇంధన అత్యవసర పరిస్థితి ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్చి 24న ఫిలిప్పీన్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ ఇంధన ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇరాన్‌తో యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన తర్వాత ఇంధన కొరత ఆ దేశంపై తీవ్రంగా పడింది. నెల రోజుల వ్యవధిలో పెట్రోల్ ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. ఇక డీజిల్ ధరలైతే మరీ ఘోరం. ఇదే కాలానికి డీజిల్ ధరలు ఇంచుమించు రెట్టింపయ్యాయి. దీంతో అధ్యక్షుడు మార్కోస్ ఒక కమిటీని ఏర్పాటు చేసి పెరిగిన ధరల ప్రభావం ఏయే రంగాలపై పడింది, ప్రైవేట్ రంగం శిలాజ ఇంధన వాడకం తగ్గింపుపై అన్వేషించాల్సి మార్గాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. 30 రోజుల పాటు బియ్యం ధరపై గరిష్ఠ పరిమితిని విధించాలని యోచిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. అలాగే చమురుపై ప్రభుత్వ పన్నులు రద్దు చేయాలన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నది. అయితే ప్రభుత్వం విధించిన ఆంక్షలు, పరిమితుల పట్ల రవాణా, మరికొన్ని రంగాల కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కంబోడియాలో 68 శాతం పెరిగిన ధరలు
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కంబోడియాలో చమురు ధరలు 68 శాతం పెరిగాయి. దీంతో ప్రభుత్వం చమురుపై పన్నులు తొలగించడమే కాక, ఇంధన పరిరక్షణ చర్యలు చేపట్టాలంటూ రాష్ర్టాలను ఆదేశించింది. కాగా, అసలే అప్పుల్లో కూరుకుపోయి ఉన్న లావోస్ దేశం అత్యధికంగా చమురు దిగుమతులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ పాఠశాలలు మూడు రోజులు మాత్రమే తెరిచేలా ఆదేశాలు అమలు చేస్తున్నది. అలాగే ఎలక్ట్రిక్ కార్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు సర్వీస్ ఫీజును తగ్గించింది. కాగా, గ్యాస్ ఆధారంగా నడిచే వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దని ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.
వియత్నాంలో వర్క్ ఫ్రమ్ హోమ్
వియత్నాంలో అక్కడి ప్రభుత్వం ఏప్రిల్ 15 వరకు కొన్ని చమురు పన్నులను సున్నా శాతానికి తగ్గించేసింది. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించింది. ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయవద్దని థాయ్‌లాండ్ ప్రధాని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఇంధన సరఫరాలను బలోపేతం చేసుకోవడానికి ఆస్ట్రేలియా, సింగపూర్ సంయుక్తంగా చర్యలు ప్రారంభించాయి. ఆస్ట్రేలియా ఇదే తరహా ప్రయత్నాలను మలేషియాతో కూడా కొనసాగిస్తున్నది. చమురు కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన పోటీ నెలకొంది. సముద్రంలో రష్యా చమురుపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయడంతో ఈ ప్రాంతంలోని అనేక దేశాలు దానిని కొనుగోలుకు ఆసక్తి చూపాయి. కాగా, తమ నౌకలు హొర్ముజ్ జలసంధి మీదుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా వచ్చేందుకు ఇరాన్‌తో తాము ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు థాయ్ ప్రధాని అనుథిన్ చర్న్‌విరకుల్ ప్రకటించారు.