వాషింగ్టన్, జూన్ 11 : ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో పాకిస్థాన్ ఓ అసాధారణ భాగస్వామిగా అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) కమాండర్ జనరల్ మైఖేల్ కురిల్లా అభివర్ణించారు. ఈ సందర్భంగా ఐసిస్, ఖొరాసన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఆపరేషన్‌లో పాకిస్థాన్ పాత్రను ఆయన కొనియాడారు. కాగా, పహల్గాం ఉగ్ర దాడి అనంతరం పాకిస్థాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ ప్రపంచ దేశాల మద్దతును కూడగడుతున్న సమయంలో అమెరికా కమాండర్ నుంచి ఈ వ్యాఖ్యలు రావడం భారత్‌ను ఆగ్రహానికి గురి చేసే అవకాశం ఉంది. ఇది దౌత్యపరమైన భంగపాటు అవునో కాదో చెప్పాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది.
ఈ నెల 14న జరిగే తమ దేశ సైన్యం 250వ వార్షికోత్సవానికి హాజరు కావాలని పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్‌కు అమెరికా ఆహ్వానం పంపింది. అదే రోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 79వ పుట్టినరోజు కూడా. ఈ నెల 12న మునీర్ వాషింగ్టన్కు చేరుకుంటారని సీఎన్-న్యూస్ 18 తెలిపింది. ఈ సందర్భంగా ఉగ్రవాదుల నిరోధానికి చర్యలు తీసుకోవాలని అమెరికా పాక్‌ను కోరనుంది.