Pak Food Crisis | పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభం రోజురోజుకూ మరింత ముదురుతోంది. పలు ప్రావిన్స్‌లో బీభత్సం సృష్టించిన వర్షాలు, వరదలు పాకిస్థాన్‌ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్నాయి. వర్షాలు, వరదలవల్ల పంటలు బాగా దెబ్బతినడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రకృతి వైపరీత్యానికి తోడు అక్కడి ప్రభుత్వం ముందుచూపు లేమి కూడా ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. దీంతో ఆకలి తీర్చుకునేందుకు అక్కడి ప్రజలు ప్రాణాలను పణంగా పెడుతున్నారు.
పాకిస్థాన్‌లో గోధుమ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయినప్పటికీ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గోధుమ పిండి కోసం ప్రజలు ఎగబడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడి గోధుమ పిండి కోసం భారీ సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఇప్పటికే మార్కెట్లో గోధుమ పిండి షార్టేజ్ ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల ఖైబర్ ఫఖ్తూన్ఖ్వా, సింధ్, బలూచిస్థాన్ వంటి ప్రాంతాల్లో సబ్సిడి గోధుమ పిండి కోసం ప్రజలు గంటల కొద్దీ వేచి చూస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యామాల్లో వైరలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మరువకముందే, తాజాగా గోధుమ పిండి సరఫరా చేస్తున్న ట్రక్కును వందలాది మంది బైక్‌లపై ఛేజ్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
గోధుమ పిండి లోడ్‌తో వెళుతున్న ట్రక్కు నుంచి పిండి బ్యాగ్‌ను కొనుగోలు చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ఏకంగా ట్రక్కు వెనుకభాగంలో ఎక్కి ప్రమాదకర రీతిలో ప్రయాణించారు. ఆ వెనుకే వందలాది మంది బైక్‌లతో ట్రక్కును వెంబడిస్తూ వెళ్లారు. ఈ వీడియో చూస్తుంటే అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియోను సజ్జద్ రాజా అనే ప్రొఫెసర్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘ఇదేం బైక్ ర్యాలీ కాదు. ఒక బ్యాగ్ గోధుమ పిండి కోసం పాకిస్థాన్ ప్రజల కష్టాలు..’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ‘పాకిస్థానీ కానందుకు సంతోషిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
This isn’t a motorcycle rally, ppl in #Pakistan are desperately chasing a truck carrying wheat flour, hoping to buy just 1 bag. Ppl of #JammuAndKashmir should open their eyes. Lucky not to be #Pakistani & still free to take decision about our future. Do we have any future with🇵🇰? pic.twitter.com/xOywDwKoiP
— Prof. Sajjad Raja (@NEP_JKGBL) January 14, 2023