వాషింగ్టన్: మొబైల్ ఫోన్లపై నిఘా పెట్టే స్పైవేర్ పెగాసస్‌ను తయారు చేసిన ఇజ్రాయెల్ సంస్థపై అమెరికా చర్యలు చేపట్టింది. ఎన్ఎస్వో గ్రూప్‌ను బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది. ‘విదేశీ ప్రభుత్వాలను అంతర్జాతీయంగా అణచివేసేందుకు ఈ సాధనాలు వీలు కల్పించాయి. అసమ్మతివాదులు, జర్నలిస్టులు, అధికారులు, ఇతరులను అధికారంలో ఉన్న ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుని వారి గళాన్ని నొక్కివేసేందుకు ఈ స్పైవేర్ ఒక సాధనంగా మారింది’ అని అమెరికా వాణిజ్య విభాగం ఒక ప్రకటనలో పేర్కొంది. అందుకే స్పైవేర్ పెగాసస్‌ను తయారు చేసి విక్రయిస్తున్న ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్వో గ్రూప్‌ను పరిమిత కంపెనీల జాబితాలో చేర్చినట్లు బుధవారం వెల్లడించింది.
భారత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం స్పైవేర్ పెగాసస్‌ను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలైన రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ వంటి వారితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నత స్థానంలోని ప్రభుత్వ శాఖాధిపతులు, సైనిక అధికారులు, న్యాయమూర్తులు, జర్నలిస్ట్‌లు, పలు రంగాలకు చెందిన వ్యక్తులపై ప్రభుత్వం నిఘా పెట్టినట్లు బహిర్గతమైన డేటా ఆధారంగా ‘ది వైర్’ పలు కథనాలు ప్రచురించింది.
దేశంలో కలకలం రేపడంతోపాటు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కుదిపేసిన స్పైవేర్ పెగాసస్ అంశంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. ఈ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చేందుకు పలు రంగాలకు చెందిన నిఫుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.