ఇస్లామాబాద్, సెప్టెంబర్ 17: భారత పార్లమెంట్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి, 26/11 ముంబై మారణకాండలో జైషే మహ్మద్ అగ్రనేత మసూద్ అజర్ ప్రమేయం ఉందని ఆ సంస్థ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ అంగీకరించాడు. తమ గడ్డపై ఉగ్రవాదులకు ఎలాంటి ఆశ్రయం కల్పించడం లేదని, ఇక్కడి నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరగడం లేదంటూ పాకిస్థాన్ బుకాయిస్తుండగా, భారత్‌లోని ఢిల్లీ, ముంబైలో ఉగ్రవాద దాడులకు తమ బాస్ మసూద్ అజర్ పాకిస్థాన్ గడ్డపై నుంచే ప్రణాళిక వేశారంటూ కాశ్మీరీ అంగీకరించడం గమనార్హం. పాకిస్థాన్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో కాశ్మీరీ మాట్లాడుతూ తమ సంస్థ చీఫ్ మసూద్ అజర్ బాలాకోట్ నుంచే భారత్‌పై ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచించి, అమలు పరిచారని ప్రకటించారు.