NASA | న్యూయార్క్, డిసెంబర్ 27: సూర్యుడి సమీపానికి వెళ్లిన పార్కర్ సోలార్ ప్రోబ్ సురక్షితంగా ఉన్నట్టు నాసా ప్రకటించింది. సూర్యుడికి 60 లక్షల కిలోమీటర్ల సమీపానికి చేరుకున్న ఈ వ్యోమనౌక నుంచి కొన్నిరోజులుగా నాసాకు సమాచారం తెగిపోయింది. అత్యంత వేడి వాతావరణానికి సమీపానికి వెళ్లిన నేపథ్యంలో ఈ వ్యోమనౌక ఆచూకీపై ఆందోళన వ్యక్తమైంది. అయితే, గురువారం అర్థరాత్రి దీని నుంచి నాసాకు మళ్లీ సిగ్నల్ అందింది. దీంతో వ్యోమనౌక సురక్షితంగా ఉన్నట్టు నాసా ప్రకటించింది.
ముందుగా నిర్దేశించిన మేర సూర్యుడి సమీపానికి ఇది చేరుకున్నదని, ఇక ఇదే దూరంతో సూర్యుడి చుట్టూ సంచరించనున్నట్టు వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం 2018లో పార్కర్ సోలార్ ప్రోబ్‌ను నాసా ప్రయోగించింది. ఇప్పటివరకు తయారుచేసిన వేగవంతమైన వ్యోమనౌకల్లో ఇది మొదటిది. గంటకు 6.90 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. సూర్యుడి దగ్గర ఉండే అసాధారణ ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు వీలుగా దీనికి ఒక రక్షణ కవచాన్ని సైతం ఏర్పాటు చేశారు.
ఇంకా చదవల్సిన వార్తలు
దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడి అభిశంసన
సియోల్: దక్షిణ కొరియా ఆపద్ధర్మ అధ్యక్షుడు హన్ డక్-సూ శుక్రవారం అభిశంసనకు గురై పదవీచ్యుతడయ్యారు. దీంతో ఆ దేశ ఆర్థిక మంత్రి చోయ్ సంగ్-మోక్ కొత్త యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. నేషనల్ అసెంబ్లీలో అభిశంసన తీర్మాన ఓటింగ్‌కు హాజరైన 192 మంది సభ్యులు హన్పై ప్రవేశపెట్టిన అభిశంసనకు అనుకూలంగా ఓటేశారని సభ స్పీకర్ వూ వాన్-షిక్ వెల్లడించారు.
అభిశంసన తీర్మానం నెగ్గడానికి సింపుల్ మెజారిటీ సరిపోతుందని స్పీకర్ ప్రకటించడంపై అధికార పీపుల్ పవర్ పార్టీ అభ్యంతరం తెలపింది. ఓటింగ్‌ను బహిష్కరించి స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపింది. తీర్మాన ఆమోదానికి మూడింట రెండొంతుల మెజారిటీ ఉండాలని వాదించింది. అయితే ఆపద్ధర్మ అధ్యక్షుడి అభిశంసనకు సంబంధించి నిర్దిష్ట చట్టాలేవీ దేశంలో లేకపోవడంతో స్పీకర్ నిర్ణయం మేరకు ఓటింగ్ జరిగింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ ఈ నెల 3న అభిశంసనకు గురి కావడంతో హన్ ఆపద్ధర్మ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.