Palastine supporters : ఆస్ట్రేలియాలో ‘డిఫెన్స్ ఎక్స్పో’కు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు నిరసనకు దిగారు. పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధం విషయంలో ఆస్ట్రేలియా తన స్టాండ్ మార్చుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అయితే నిరసనకారులపై మెల్బోర్న్ పోలీసులు లాఠీలు ఝలిపించారు. దొరికినవాళ్లు దొరికినట్టే తీవ్రంగా కొట్టారు. స్పాంజ్ గ్రెనేడ్లు, టియర్ గ్యాస్, ఫ్లాష్ బ్యాంగ్ పరికరాలు, స్ప్రేలను ప్రయోగించారు.
మెల్బోర్న్లో నిర్వహిస్తున్న ‘ల్యాండ్ ఫోర్సెస్ 2024’ ప్రదర్శన (డిఫెన్స్ ఎక్స్పో) ను అడ్డుకోవాలని స్టూడెంట్స్ ఫర్ పాలస్తీనా అండ్ డిస్రప్ట్ వార్ గ్రూపులు ఇటీవల పిలుపునిచ్చాయి. విద్యార్థి సంఘాల పిలుపు మేరకు సుమారు 1200 మంది ఈ నిరసనలో పాల్గొన్నారు. పాలస్తీనా జెండాలు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ దేశం గాజాపై యుద్ధాన్ని నిలిపివేసేలా ఆస్ట్రేలియా ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేశారు.
అయితే నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై దాడికి పాల్పడటం, ప్రభుత్వ ఆస్తుల దగ్ధం, రహదారిని అడ్డుకోవడం లాంటి నేరాలపై 33 మందిని అరెస్ట్ చేశారు. పోలీసులపై రాళ్లతో, గుర్రపు ఎరువు, లిక్విడ్ సీసాలతో నిరసనకారులు దాడి చేశారని విక్టోరియా స్టేట్ పోలీసులు తెలిపారు.