Pakistan | ఇస్లామాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు.. ఆయా పార్టీల జెండాలు పల్లెలు, పట్టణాల్లో రెపరెపలాడుతుంటాయి. అయితే ఓ పార్టీ జెండా ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వ్యతిరేక పార్టీ జెండాను ఇంటిపై పెట్టినందుకు, కోపంతో ఊగిపోయిన తండ్రి తన కుమారుడిని హతమార్చాడు. ఈ ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్లో జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో ఖైబర్ ఫక్తున్‌క్వా ప్రావిన్స్‌లోని పెషావర్‌లో ఓ యువకుడు తన ఇంటిపై పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ జెండాను పెట్టాడు. ఈ యువకుడు ఇటీవలే ఖతర్ నుంచి పెషావర్‌కు తిరిగొచ్చాడు. అయితే పాక్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ పార్టీ జెండాను ఇంటిపై పెట్టడాన్ని యువకుడి తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆ జెండాను తొలగించనని కుమారుడు తెగేసి చెప్పాడు. ఈ క్రమంలో తండ్రీకుమారుల మధ్య వివాదం మరింత ముదిరింది. సహనం కోల్పోయిన తండ్రి తన 31 ఏండ్ల కుమారుడిపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం ఆస్పత్రికి తరలిస్తుండగా కుమారుడు ప్రాణాలొదిలాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుమారుడి ప్రాణాలను బలిగొన్న తండ్రి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కుమారుడిని హత్య చేసిన తండ్రి.. అవామీ నేషనల్ పార్టీకి చెందిన కార్యకర్త అని తేలింది. పాకిస్తాన్ జనరల్ ఎలక్షన్స్ ఫిబ్రవరి రెండో వారంలో జరగనున్నాయి.