న్యూఢిల్లీ, మార్చి 11 : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులో మంగళవారం 500 మంది ప్రయాణికులతో వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును వేర్పాటువాద తీవ్రవాదులు హైజాక్ చేశారు. పెషావర్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌పై దాడి చేసి దాదాపు 214 మందిని బందీలుగా పట్టుకున్నారు. రైలును ఓ సొరంగంలో నిలిపి ఉంచినట్టు తెలుస్తోంది. ఈ దాడికి తామే బాధ్యులమంటూ వేర్పాటువాద తీవ్రవాద గ్రూపు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించింది. 30 మంది భద్రతా సిబ్బందిని చంపివేసినట్టు బీఎల్ఏ వెల్లడించింది. పాకిస్థాన్ ప్రభుత్వం తమపైన సైనిక చర్యకు దిగితే బందీలందరినీ కాల్చివేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది. కాగా, పాకిస్థానీ భద్రతా దళాలు రైలు నిలిచిపోయిన ప్రదేశానికి చేరుకుని ఎదురుదాడి ప్రారంభించినట్లు వార్తలు అందాయి. హెలికాప్టర్ ద్వారా బాంబులు వేయడంతోపాటు నేలపైనుంచి కూడా భద్రతా సిబ్బంది కాల్పులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే సైన్యం కాల్పులను తిప్పికొట్టినట్టు బీఎల్ఏ ప్రకటించింది. సైన్యాన్ని అక్కడి నుంచి తరిమివేశామని వెల్లడించింది. హెలికాప్టర్ల ద్వారా బాంబు దాడులు కొనసాగుతున్నట్టు బీఎల్ఏ తెలిపింది. బలూచ్ రాజకీయ ఖైదీలను 48 గంటల్లోగా విడుదల చేయాలని పాక్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేసింది. మరోవైపు, సైనికులు, డాక్టర్లతో సంఘటనా స్థలానికి రిలీఫ్ రైలును పాక్ సైన్యం పంపినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అంబులెన్సులు కూడా అక్కడకు బయల్దేరినట్టు పేర్కొన్నాయి.
బలూచిస్థాన్‌లోని క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై భీకర కాల్పులు జరిగినట్టు వార్తలు వచ్చాయని బలూచిస్థాన్ ప్రొవిన్షియల్ ప్రభుత్వ ప్రతినిధి షాహిద్ రింద్ ప్రకటించారు. రైల్వే ట్రాకును తమ సైనికులు పేల్చివేయడంతో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ఒక సొరంగంలో నిలిచిపోయిందని, ప్రయాణికులందరినీ బందీలుగా పట్టుకోవడంతోపాటు రైలును పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని బీఎల్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. తమ గ్రూపునకు చెందిన ప్రత్యేక విభాగాలైన మజీద్ బ్రిగేడ్, ఫతే స్కాడ్ సంయుక్తంగా ఈ దాడి జరిపినట్టు వెల్లడించింది. ఎటువంటి సైనిక చర్యకు పాల్పడినా ప్రతిస్పందన అంతే తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. తీవ్రవాదుల కాల్పులలో రైలు డ్రైవర్ గాయపడినట్టు పోలీసులు, రైల్వే అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా సహాయక బృందాలు, భద్రతా దళాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. తీవ్రవాదుల ఆచూకీని కనుగొనేందుకు భద్రతా సిబ్బంది చర్యలు చేపట్టారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంజిన్ డ్రైవర్‌కు సహాయపడేందుకు అత్యవసర సహాయ బృందాన్ని ఘటనా స్థలికి పంపినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. తీవ్రవాదులకు బందీలుగా మారిన వారిలో పాకిస్థానీ సైన్యం, పోలీసు, ఉగ్రవాద నిరోధక దళం(ఏటీఎఫ్), ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) సిబ్బంది కూడా ఉన్నారు. వీరంతా సెలవుపై పంజాబ్‌కు వెళుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
మహిళలు, పిల్లలు, బలూచ్ ప్రయాణికులను విడుదల చేశామని బీఎల్ఏ ప్రకటించింది. దీంతో తీవ్రవాదుల చెరలో బందీలుగా మిగిలింది కేవలం పాకిస్థానీ భద్రతా దళాలకు చెందిన సిబ్బంది మాత్రమేనని తెలుస్తోంది. ఈ ఘటనలో కొందరు మరణించారు. బందీల పరిస్థితి గురించి బలూచ్ ఆధికారులు, రైల్వే అధికారులు వెల్లడించవలసి ఉంది. పాకిస్థాన్ నుంచి బలూచిస్థాన్‌కు విముక్తి కల్పించాలని వివిధ బలూచ్ వేర్పాటువాద గ్రూపులు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తుండగా ఇటీవలనే పాకిస్థాన్, చైనాకు వ్యతిరేకంగా బలూచ్ నేషనల్ ఆర్మీ పేరిట ఓ కొత్త తీవ్రవాద గ్రూపు ఏర్పడింది. అనేక ఏండ్లుగా వేర్పాటువాద సమస్యను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ఇటీవలి కాలంలో అనేక ఉగ్రవాద దాడులను ఎదుర్కొంది. తాజాగా మార్చి 5న ఖుజ్దార్ జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఐదుగురు మరణించగా మరో ఐదుగురు గాయపడ్డారు.
బలూచ్ పౌరులపై పాకిస్థాన్ ప్రభుత్వం సాగించిన మారణకాండ, దాడులే వారు ఆ దేశం నుంచి విడిపోవాలని బలంగా కోరుకోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇందులో బలవంతపు అదృశ్యాలు కూడా ప్రధాన కారణం. జాతి వివక్షను ఎదుర్కొంటున్న బలూచ్ ప్రజలపై పాకిస్థాన్ ప్రభుత్వం సాగించిన దుశ్చర్యలలో ఇదొకటని వారు చెబుతున్నారు. 2011 నుంచి 2024 జనవరి వరకు పాకిస్థాన్‌లో మొత్తం 10,078 మంది అదృశ్యం కాగా వారిలో 2,752 మంది బలూచ్ పౌరులేనని ఐక్యరాజ్యసమితిని ఉటంకిస్తూ ఫ్రెంచ్ వార్తా సంస్థ లె మాండే వెల్లడించింది. 2001-2017 మధ్య 5,228 మంది బలూచ్ పౌరులు అదృశ్యమైనట్టు ది వాయిస్ ఫర్ బలూచ్ మిస్సింగ్ పర్సన్స్ వెల్లడించింది. నైరుతి పాకిస్థాన్‌లో ఉన్న బలూచిస్థాన్ దేశంలోని మొత్తం భూభాగంలో 44 శాతం వైశాల్యం కలిగి ఉన్నప్పటికీ పాక్‌లోని మొత్తం 24 కోట్ల జనాభాలో కేవలం 6 శాతం మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు.
బలూచిస్థాన్‌లో చురుకుగా వేర్పాటువాద కార్యకలాపాలు సాగిస్తున్న గ్రూపులలో బీఎల్ఏ ప్రధానమైంది. రాజకీయంగా, ఆర్థికంగా పాకిస్థాన్ ప్రభుత్వం నుంచి వేరుపడి స్వతంత్ర బలూచిస్థాన్ ఏర్పరచాలన్నదే బీఎల్ఏ లక్ష్యం. పాకిస్థానీ భద్రతాధికారులు, ప్రభుత్వ కట్టడాలు, స్థావరాలు ప్రత్యేకంగా చైనా-పాకిస్థాన్ ఎకనమిక్ కారిడార్ కింద చైనా నిధులతో నిర్మించిన కట్టడాలపై బీఎల్ఏ అనేక దాడులు జరిపింది. పాకిస్థాన్‌లో బీఎల్ఏ నిషేధానికి గురైంది. మరి కొన్ని దేశాలు దీన్ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. బీఎల్ఏకి చెందిన ప్రత్యేక దళాల విభాగమైన మజీద్ బ్రిగేడ్ ఆత్మాహుతి దాడులు చేస్తుంది. 1974లో అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో హత్యకు ప్రయత్నించిన అబ్దుల్ మజీద్ బలూచ్ గౌరవార్థం ఆయన పేరుతో ఏర్పడిన ఈ గ్రూపు అనేకమంది ప్రముఖులపై దాడులకు పాల్పడింది. 1947లో బ్రిటిష్ పాలకులు దేశాన్ని విడిచి వెళ్లిపోతూ బలూచిస్థాన్తో కలుపుకుని ఉన్న కలాత్ సంస్థానానికి కూడా స్వాతంత్య్రం ప్రకటించారు. అయితే దాని హోదా వివాదాస్పదంగా మారింది. దీంతో కలాత్ రాజుతో చర్చలు జరిపిన పాక్ 1948 మార్చిలో లాంఛనంగా తన దేశంలో విలీనం చేసుకుంది. ఇది తిరుగుబాటుకు దారితీసింది. 1948, 1958-59, 1973-77లో తిరుగుబాటు జరగగా 2004 నుంచి తమకు మరింత ఆర్థిక, రాజకీయ ప్రతిపత్తి కావాలన్న డిమాండ్లు బలూచ్ ప్రజల నుంచి పెరిగిపోయాయి.