న్యూఢిల్లీ: చైనా స్టీల్త్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చైనాకు చెందిన జే-35ఏ(J-35A Fighter Jets ) అడ్వాన్స్డ్ మిలిటరీ విమానాలను.. కొనుగోలు చేయాలని పాకిస్తాన్ భావిస్తున్నది. సుమారు 40 విమానాలను ఆ దేశం ఖరీదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ డీల్ కుదిరితే.. జే-35ఏ స్టీల్త్ ఫైటర్ విమానాలు .. తొలిసారి చైనా దాటి బయటి ప్రపంచంలో కనబడనున్నాయి. డ్రాగన్ దేశం కూడా తొలిసారి అత్యాధునిక మిలిటరీ విమానాలను మరో దేశానికి అమ్మేందుకు ఆసక్తి కనబరుస్తోంది.
జే-35ఏ రెండవ ఫిఫ్త్ జనరేషన్ స్టీల్త్ ఫైటర్ విమానం. అమెరికా తర్వాత ప్రపంచంలో రెండవ ఫిఫ్త్ జనరేషన్ స్టీల్త్ విమానం ఉన్న మరో దేశంగా చైనా ఉన్నది. అమెరికాకు చెందిన ఎఫ్-16, ఫ్రాన్స్ మిరాజ్ యుద్ధ విమానాలు ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉన్నాయి. అయితే కాలం చెల్లిన ఆ విమానాల స్థానంలో.. చైనా స్టీల్త్ విమానాలను తీసుకోవాలని పాకిస్థాన్ భావిస్తున్నది.
కేవలం రెండేళ్లలోనే 40 స్టీల్త్ విమానాలనకు పాకిస్థాన్‌కు చైనా సరఫరా చేయనున్నట్లు ఓ మీడియా కథనం ద్వారా తెలిసింది. భారీ సంఖ్యలో విమానాలను ఉత్పత్తి చేసేందుకు చైనా రక్షణ శాఖ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.