ఇస్లామాబాద్, జనవరి 18: బలూచిస్థాన్‌లో ఇరాన్ జరిపిన దాడులపై పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్‌లోని సియెస్థాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టుగా భావిస్తున్న నిర్దిష్ట లక్ష్యాలపై గురువారం సైనిక దాడులు జరిపింది. దాడుల్లో నలుగురు పిల్లలు సహా తొమ్మిది మంది మరణించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరాయి.
ఇప్పటికే ఓ వైపు గాజా స్ట్రిప్‌లోని హమాస్ సంస్థపై ఇజ్రాయెల్ దాడులు, మరోవైపు ఎర్ర సముద్రంలో హౌతీ ఉగ్రవాదులపై అమెరికా నేతృత్వంలో దాడులతో పశ్చిమాసియా అంతటా అల్లకల్లోలంగా ఉండగా.. ఇరాన్, పాక్ మధ్య దాడులతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఇరాన్ మరోవైపు ఇరాక్, సిరియాలపై కూడా క్షిపణులు, డ్రోన్ దాడులకు పాల్పడిందని అమెరికా వెల్లడించింది. పాకిస్థాన్, ఇరాన్‌లు సంయమనం పాటించాలని చైనా కోరగా, ఇరాన్, పాక్‌ల మధ్య దాడులు ఆయా దేశాల అంతర్గత వ్యవహారమని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. ‘ఆత్మరక్షణ కోసం ఆయా దేశాలు చేపట్టే చర్యలను మేం అర్థం చేసుకోగలం’ అని తెలిపింది.
సోదర దేశమంటూనే దాడి
బలూచిస్థాన్‌లో ఇరాన్ మంగళవారం జరిపిన దాడిన తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించిన పాకిస్థాన్.. ఇందుకు తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే ‘మార్గ్ బర్ సర్మచార్ (గెరిల్లాలకు మరణం)’ అనే కోడ్ పేరుతో ఇరాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. ఇరాన్ భూభాగంలో పాక్‌కు 80 కిలోమీటర్ల దూరంలోని సుమారు ఏడు లక్ష్యాలపై కిల్లర్ డ్రోన్లు, రాకెట్లు, పేలుడు పదార్థాలతో దాడులు జరిపామని పేర్కొంది.
ఈ దాడుల్లో బలూచిస్థాన్ విమోచన సైన్యం (బీఎల్ఏ), బలూచిస్థాన్ విమోచన ఫ్రంట్ (బీఎల్ఎఫ్)కు చెందిన మిలిటెంట్లు హతమయ్యారని పేర్కొంది. ఈ రెండు గ్రూపులు గతంలో పాకిస్థాన్‌లో అనేక దాడులకు పాల్పడ్డాయని తెలిపింది. ఇరాన్ తమ సోదర దేశమని ఆ దేశ సార్వభౌమత్వాన్ని పాక్ సంపూర్ణంగా గౌరవిస్తుందని పాక్ తెలిపింది. కేవలం తమ దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ దాడులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది.
‘పాక్ సార్వభౌమత్వాన్ని సవాలు చేసే ఏ చర్యను ఉపేక్షించబోం. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్పందించే హక్కు మాకుంది. ఇరాన్ ప్రజల పట్ల పాకిస్థానీలకు ఎంతో గౌరవం ఉంది. ఉగ్రవాద ముప్పుతో సహా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడంలో సంప్రదింపులు, చర్చలకు ఉన్న ప్రాధాన్యాన్ని మేం గౌరవిస్తాం’ అని పాక్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నాం
ఇరాన్, పాకిస్థాన్‌లు 900 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. దీంతో రెండు దేశాల ఉగ్ర మూకలు తరచుగా ఇటు నుంచి అటు.. అటు నుంచి ఇటు వస్తూ పోతుంటాయి. పాక్ మూలాలున్న ఉగ్రవాదులు ఇరాన్‌లోని కొన్ని ప్రదేశాలను స్థావరాలుగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తున్న సంగతిని ఎప్పటినుంచో హెచ్చరిస్తున్నామని ఇస్లామాబాద్ తెలిపింది. ఇందుకు తగిన ఆధారాలను కూడా ఇరాన్‌కు ఇచ్చామని, అయినప్పటికీ ఆ దేశ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని పేర్కొంది. ఇరాన్ అలసత్వం ఫలితంగా ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో రక్తపాతానికి పాల్పడుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో పక్కా ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు జరిపామని వెల్లడించింది.
పాక్ అధ్యక్షుడి సమర్థన
ఇరాన్‌పై చేసిన దాడులను పాక్ అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ సమర్థించుకున్నారు. జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తమ భూభాగాన్ని రక్షించుకొనేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. పక్కా సమాచారంతో అత్యంత కచ్చితత్వంతో తమ సైన్యం దాడులు జరిపిందని తెలిపారు. పాక్, ఇరాన్‌లు సహోదర దేశాలని, ఏమైనా సమస్యలుంటే చర్చలు, పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని అన్నారు. ఇరాన్‌తో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో.. దావోస్ పర్యటనలో ఉన్న పాక్ తాత్కాలిక ప్రధాని అన్వారుల్ హల్ కాకర్ హుటాహుటిన స్వదేశం తిరిగివచ్చారు.
ఇరాన్‌పై అమెరికా ఆగ్రహం
ఇరాన్ 48 గంటల వ్యవధిలో మూడు దేశాల సరిహద్దులను ఉల్లంఘించి దురాక్రమణకు పాల్పడిందని అమెరికా విదేశాంగ శాఖ మండిపడింది. ఓ వైపు ఇరాన్ పశ్చిమాసియాలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు నిధులు సమకూరుస్తూనే.. మరోవైపు ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు దాడులు జరుపుతున్నామని చెప్పడం విస్మయం కలిగిస్తున్నదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వ్యాఖ్యానించారు. ‘ఇరుపక్షాలు ఉద్రిక్తతలను పెంచే చర్యలను నివారించాలి. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పాలి’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ పిలుపునిచ్చారు. ఇరాన్ నుంచి భారీ ఎత్తున చమురును దిగుమతి చేసుకొంటూ.. పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు నడుపుతున్న చైనా ప్రస్తుతం ఏ పక్షమూ వహించలేని స్థితిని ఎదుర్కొంటున్నది.