ఇస్లామాబాద్: గత కొన్ని రోజుల నుంచి పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఆందోళనలు మిన్నంటుతున్న విషయం తెలిసిందే. అయితే శనివారం నిరసనకారులు, పాక్ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. హింసాత్మక ఆందోళనల్లో ఇప్పటి వరకు పది మంది మృతిచెందగా, వందలాది మంది గాయపడ్డారు. జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ(జేకేజేఏఏసీ), ప్రభుత్వం మధ్య సెప్టెంబర్ 29వ తేదీన జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్కడ హింస మొదలైంది. జేఏఏసీ ఆందోళనకారులు తీవ్ర స్థాయిలో హింసకు పాల్పడ్డారు. నిరసన సమయంలో వాహనాలకు నిప్పుపెట్టారు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో పది మంది మరణించారు.
38 పాయింట్ల ఎజెండాతో జేఏఏసీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. తొలుత ప్రభుత్వం ఆ డిమాండ్లకు అంగీకరించలేదు. దీంతో ఆందోళన ఉదృతమైంది. పోలీసులు, పౌరులు హింసలో గాయపడ్డారు. అయితే ఇవాళ రెండు వర్గాల మధ్య డీల్ కుదిరినట్లు ప్రకటించారు. కుట్రలు, అవాస్తవాలన్నీ సమసి పోయినట్లు ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రకటించారు. జేఏఏసీతో డీల్ కుదుర్చుకున్న ప్రభుత్వ కమిటీకి ధన్యావాదాలు తెలిపారు. శాంతి, సామరస్యం ఏర్పడడం మంచి సంకేతం అన్నారు.