ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్‌గా ఉన్న అసీం మునీర్‌ను షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం తమ దేశ రక్షణ దళాల తొలి అధిపతి (సీడీఎఫ్)గా నియమించింది. అణ్వాయుధ దేశమైన పాక్‌లో ఈ పోస్ట్‌ను కొత్తగా సృష్టించారు. ఈ పదవిలో మునీర్ ఐదేండ్లు ఉంటారు. మునీర్‌ను సీడీఎఫ్తోపాటు సైనిక సిబ్బందికి ప్రధానాధికారిగా నియమించాలన్న ప్రధాని సిఫారసును ఆమోదించినట్టు పాక్ అధ్యక్షుడి కార్యాలయం శుక్రవారం ప్రకటించింది.
ఈ నియామకంతో పాక్ సైన్యం, నౌకా దళం, వైమానిక దళం మునీర్ అధికార పరిధిలోకి వచ్చాయి. ముఖ్యంగా దేశంలోని అణ్వాయుధాలు, క్షిపణి వ్యవస్థలను నిర్వహించే జాతీయ వ్యూహాత్మక కమాండ్‌ను పర్యవేక్షించే అధికారం కూడా ఆయనకే దఖలుపడింది. దీంతో దేశంలోనే అత్యంత శక్తిమంతమైన మిలిటరీ అధికారిగా మునీర్ నిలిచారు. తాజా పదవితో మునీర్ దేశాధ్యక్షుడితో సమానంగా చట్టబద్ధమైన రక్షణను అనుభవించనున్నారు. ఆయన జీవించినంత కాలం చట్టబద్ధమైన విచారణను ఎదుర్కోకుండా మినహాయింపు లభించింది.