Abhinandan Varthaman | 2019 బాలాకోట్ (Balakot) దాడుల సమయంలో అప్పటి భారత వయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ (Abhinandan Varthaman)ను అదుపులోకి తీసుకున్న పాక్ అధికారి మేజర్ మోయిజ్ అబ్బాస్ షా (Major Moiz Abbas Shah) తాజాగా మరణించారు. పాక్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయాడు. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) రాష్ట్రంలో బుధవారం తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులతో జరిగిన తీవ్రస్థాయి ఘర్షణలో మేజర్ అబ్బాస్ షా మరణించారు.
పాకిస్థాన్ సైన్యంలోని ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్జీ)లో అబ్బాస్ షా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో భాగంగా ఆయన బృందం కూంబింగ్ నిర్వహిస్తుండగా టీటీపీ ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులకు తెగబడినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. పాకిస్థాన్‌లోని దక్షిణ వజీరిస్థాన్ జిల్లాలో నిఘా ఆధారిత ఆపరేషన్ (ఐబిఓ)లో భద్రతా దళాలు 11 మంది ఉగ్రవాదులను హతమార్చగా, ఇద్దరు భద్రతా సిబ్బంది అమరులయ్యారని పాక్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
2019 ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో జవాన్లు అమరులుకాగా, పలువురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 27న భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది. బాలకోట్ (Balakot)లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను బాంబులతో పేల్చివేసింది. ఈ ఘటనలో వందల సంఖ్యలో ఉగ్రవాదులు మరణించారు. భారత వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్‌ను అడ్డుకునేందుకు అత్యాధుక ఎఫ్-16 ఫైటర్ జెట్స్‌ను పాకిస్థాన్ రంగంలోకి దించింది.
మిగ్-21 యుద్ధ విమానాన్ని నడుపుతున్న వింగ్ కమాండర్ అభినందన్, పాక్‌కు చెందిన ఒక ఎఫ్-16ను కూల్చివేశారు. ఈ సందర్భంగా కూలిపోతున్న మిగ్-21 నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్లో దిగిన ఆయనను పాక్ ఆర్మీ నిర్బంధించింది. ఈ ఘటన అనంతరం అభినందన్‌ను భారత ప్రభుత్వం ‘శౌర్యచక్ర’తో సత్కరించిన విషయం తెలిసిందే. అంతేకాదు, వాయుసేనలో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న అభినందన్‌ను గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోట్ చేశారు. ఇది సైనిక దళంలో కర్నల్ ర్యాంక్‌కు సమానం.
Also Read..
Bikram Majithia | డ్రగ్స్ కేసులో పంజాబ్ మాజీ మంత్రి అరెస్ట్..!
Shubhanshu Shukla | రోదసి యాత్రకు ముందు.. తల్లిదండ్రులకు శుభాన్షు ఏం సందేశం పంపారంటే..