Afghan Crisis | ఆఫ్ఘనిస్థాన్ సంక్షోభంపై చైనా, రష్యాలతోపాటు ఇతర సెంట్రల్ ఆసియా దేశాల నిఘా అధిపతుల సమావేశం పాకిస్థాన్‌లో జరిగింది. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ ఫియాజ్ హమీద్ ఈ సమావేశానికి సారధ్యం వహించినట్లు తెలుస్తోంది.
ఇరాన్, కజకిస్థాన్, తజికిస్థాన్, తుర్క్మెనిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల నిఘా అధిపతులు హాజరైనట్లు సమాచారం. తాలిబన్ల ఆహ్వానం మేరకు కాబూల్‌కు ఫియాజ్ హమీద్ వచ్చి వెళ్లిన తర్వాత ఈ భేటీ జరుగడం గమనార్హం. ఇదే వారంలో రష్యా మినహా మిగతా దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం అయిన సంగతి తెలిసిందే.
రష్యాతోపాటు మధ్యాసియా దేశాల ప్రభుత్వాలు ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలను నిశితంగా గమనిస్తున్నాయి. ఆఫ్ఘన్ నుంచి ఇతర ఆసియా దేశాలకు భారీగా వలసలు ఉంటాయని రష్యా మాజీ మంత్రి ఒకరు పేర్కొన్నట్లు వార్తలొచ్చాయి.
తాలిబన్ల ప్రభావంతో సెంట్రల్ ఆసియా దేశాలకు ఇస్లామిక తీవ్రవాద ముప్పు పొంచి ఉందని రష్యా సందేహిస్తున్నది. మరోవైపు తాలిబన్ల సారధ్యంలోని ఆఫ్ఘన్ ప్రభుత్వంతో ఆర్థిక వాణిజ్య సంబంధాలు, పాక్-ఆఫ్ఘన్ సెక్యూరిటీపై ఐఎస్ఐ చీఫ్ సారధ్యంలోని ప్రతినిధి బృందం చర్చించనున్నట్లు తెలియవచ్చింది.