ఇస్లామాబాద్: మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్న తండ్రిని తుపాకీతో కాల్చి కుమార్తె హత్య చేసింది. (girl shoots father dead for raping ) నరకయాతన తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులకు వెల్లడించింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. లాహోర్ నగరంలోని గుజ్జర్‌పురా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక శనివారం తండ్రికి చెందిన గన్‌తో అతడిపై కాల్పులు జరిపింది. దీంతో ఆ వ్యక్తి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి వెళ్లారు. మూడు నెలలుగా తండ్రి తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నట్లు బాధిత బాలిక పోలీసులకు తెలిపింది. దీంతో తాను ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నట్లు చెప్పింది. దీనిని భరించలేక తండ్రికి చెందిన తుపాకీతో కాల్పులు జరిపి చంపినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మైనర్ కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పాకిస్థాన్ కోర్టు శుక్రవారం మరణశిక్ష విధించింది. లాహోర్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి మియాన్ షాహిద్ జావేద్ నిందితుడు రఫీక్‌కు ఈ మేరకు శిక్ష విధించారు. ఈ తీర్పు వెలువడిన ఒక రోజు తర్వాత, మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్న తండ్రిని కుమార్తె కాల్చి చంపిన సంఘటన వెలుగులోకి వచ్చింది.