న్యూఢిల్లీ: అఫ్ఘానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలకు (Pak-Afghan Clashes) తెరపడింది. ఇరు మధ్య జరిగిన శాంతి చర్చలు ఫలించాయి. ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా జరగిన చర్చల్లో తక్షణ కాల్పుల విరమణకు (Ceasefire) అంగీకరించాయి. ఈమేరకు ఖతార్ (Qatar) విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది. రెండు దఫాలుగా జరిగిన ఈ చర్చల్లో శాశ్వత శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొంది. ఈ చర్చల్లో ఇరుదేశాలకు చెందిన రక్షణ మంత్రులు పాల్గొన్నారని తెలిపింది.
కాగా, ఇరు దేశాల మధ్య కుదిరిన 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అఫ్ఘనిస్థాన్‌పై పాక్ శుక్రవారం అర్ధరాత్రి వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ముగ్గురు స్థానిక క్రికెటర్లు సహా 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని పాక్ భద్రతాధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే, తాము చేసిన ఈ దాడుల్లో డజన్ల మంది సాయుధ దళాల సిబ్బంది మరణించారని, పౌరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని పేర్కొన్నారు.
ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు త్వరలో పాకిస్థాన్, శ్రీలంకతో జరగనున్న ముక్కోణపు సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని పక్తికా ప్రావిన్సులోని జిల్లాలపై పాక్ వైమానిక దాడులకు దిగినట్టు అధికారులు తెలిపారు. పాక్ దాడుల్లో మరణించిన ముగ్గురు క్రికెటర్లను కబీర్, సిబ్ఘహతుల్లా, హరూన్గా గుర్తించారు. వీరు ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ కోసం ప్రొవిన్షియల్ రాజధాని అయిన షరానాకు వెళ్లి తిరిగి ఉర్గున్ జిల్లాలోని తమ ఇంటికి చేరుకోగా పాక్ దాడుల్లో మరణించారు. ఈ దాడుల్లో మరో ఐదుగురు మరణించారని, ఏడుగురు గాయపడ్డారని అఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది.