వాషింగ్టన్: అమెరికాలో ఉద్యోగాల కోత (Mass Layoffs) మొదలైంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సలహాదారు, డోజ్ చీఫ్ ఎలాన్ మస్క్ నిర్ధాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 75 వేల మందికి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేయాలని ఆదేశాలు జారీచేసిన ట్రంప్ సర్కార్.. తాజాగా వివిధ ఏజెన్సీలలో పనిచేస్తున్న 9500 మందికిపైగా కార్మికులపై వేటు వేసింది. తొలగింపునకు గురైనవారిలో ఫెడరల్ భూముల వ్యవహారాలు చూసే కార్మికులు, మిలిటరీ ప్రముఖుల కేర్‌లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా ఇంటీరియర్ డిపార్ట్మెంట్లు, ఎనర్జీ, వెటరన్స్ అఫైర్స్, వ్యవసాయం, హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ఉద్యోగులు కూడా ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఫెడరల్ ఏజెన్సీలన్నింటినీ అమెరికా వదిలించుకోవాల్సి సమయం వచ్చేసిందని ఇప్పటికే ఎలాన్ మస్క్ ప్రకటించారు. ప్రభుత్వ పనితీరును సమూలంగా పునర్వ్యవస్థీకరించడంలో భాగంగా ఈ చర్య తప్పదని స్పష్టం చేశారు. వృథా ఖర్చుల తగ్గింపు, సామర్థ్య పెంపు కోసం ఏజెన్సీల సామూహిత మూసివేతలు తప్పవన్నారు. ఇందులో భాగంగా ఫెడరల్ వర్క్ ఫోర్స్‌లో పరిమాణాన్ని తగ్గించేందుకు, ప్రొబేషనరీ (ఏడాది కంటే తక్కువ అనుభవం ఉన్న) ఉద్యోగులను తొలగించాలని మస్క్ ఆదేశాలు జారీచేశారు. అన్ని విభాగాల్లో ప్రొబేషనరీ ఉద్యోగులను తొలగించాలని ఏజెన్సీలకు స్పష్టం చేశారు. అయితే ఉద్యోగాల కోతలు విధించే వాటిలో లా ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ సెక్యూరిటీ , ఇమ్మిగ్రేషన్ విభాగాలకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో మినహాయింపు ఇచ్చారు.
పోస్టల్ సేవలు మినహాయించి అమెరికాలో దాదాపు 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరంతా వివిధ ఏజెన్సీలలో పనిచేస్తున్నారు. ఫెడరల్ శ్రామిక శక్తిలో భద్రతా సంబంధిత ఏజెన్సీలు ఎక్కువ భాగాన్ని కలిగి ఉన్నాయి. కానీ అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మాజీ సైనికుల ఆరోగ్య సంరక్షణను, వ్యవసాయాన్ని పర్యవేక్షించడం, ప్రభుత్వ బిల్లులు చెల్లించడం వంటి ఇతర ఉద్యోగాలలో పనిచేస్తున్నారు.
అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించేందుకు ఇప్పటికే ట్రంప్ బైఅవుట్ ప్యాకేజీతో ఆఫర్ ప్రకటించారు. దీని కింద ఫిబ్రవరి 6లోగా ఉద్యోగాలు స్వచ్ఛందంగా వదులుకున్న వారికి 8 నెలల జీతం ఇస్తానని చెప్పారు. అయితే ఈ విషయంలో ఫెడరల్ కోర్టులో ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. బైఅవుట్ ఆఫర్‌ను ఫెడర్ల్ కోర్టు న్యాయమూర్తి నిలిపివేశారు.