America | వాషింగ్టన్, జనవరి 24 : తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపిస్తానని, ఇందుకోసం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని చేపడతానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు పని మొదలుపెట్టారు. మూడు రోజుల్లోనే అమెరికా అధికారులు 538 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేశారని, వందలాది మంది సైనిక విమానాల్లో దేశం నుంచి పంపించేశారని వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలీన్ లీవిట్ తెలిపారు. అరెస్టు చేసిన అక్రమ వలసదారులు అనేక నేరాలకు పాల్పడ్డారని ఆమె చెప్పారు.
వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు అమెరికాలోని భారతీయ విద్యార్థులను తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నది. చదువుకుంటూ క్యాంపస్ బయట పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసుకునే విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్యాంపస్ బయట పని చేస్తూ అధికారులకు దొరికితే దేశం నుంచి పంపిస్తారని భయపడుతున్నారు. ఎఫ్-1(స్టూడెంట్) వీసాపై అమెరికాకు ప్రతియేటా లక్షలాది మంది భారతీయ విద్యార్థులు వస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రులు దాదాపు రూ.30-40 లక్షలు ఖర్చు చేస్తున్నారు. అమెరికా వచ్చిన తర్వాత విద్యార్థులు తమ జీవనవ్యయం కోసం చదువుకుంటూ, ఏదో ఓ పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తుంటారు. అయితే, నిబంధనల ప్రకారం విద్యార్థులు యూనివర్సిటీ క్యాంపస్‌లోనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయాలి. అది కూడా వారానికి 20 గంటలకు మించి పని చేయొద్దు.
క్యాంపస్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. పైగా వారానికి 20 గంటలే పని చేస్తే ఖర్చులకు డబ్బులు సరిపోవు. దీంతో విద్యార్థులు క్యాంపస్ బయట రోజుకు 6-8 గంటల పాటు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తున్నారు. ట్రంప్ రాకతో పని ప్రదేశాల్లో అధికారులు తనిఖీలు చేపడతారని, క్యాంపస్ బయట పని చేస్తూ దొరికితే దేశం నుంచి పంపిస్తారని భయపడుతున్నారు. ‘కొత్త నిబంధనను ఇమిగ్రేషన్ అధికారులు కఠినంగా అమలు చేస్తారని విని ఉద్యోగం మానేశాను. రిస్క్ తీసుకోలేను’ అని ఇలినాయీ యూనివర్సిటీ విద్యార్థి ఒకరు వాపోయారు. ‘కొన్ని నెలలు పరిస్థితిని పరిశీలించిన తర్వాతే పార్ట్టైమ్లోకి చేరతాం. అప్పటివరకు అప్పు చేయడమో, తల్లిదండ్రులను డబ్బులు అడగడమో తప్పదు’ అని న్యూయార్క్‌లో మాస్టర్స్ చేస్తున్న మరో విద్యార్థి చెప్పారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన రహస్యాలు బయటకు రానున్నాయి. ఆయనతో పాటు పౌర హక్కులకై పోరాడిన నాయకుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెనడీ హత్యలకు సంబంధించి ఇంతకాలం రహస్యంగా ఉన్న ఫైళ్లు బహిర్గతం కానున్నాయి. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఆదేశాన్ని జారీ చేశారు. ఫైళ్లను బయటపెట్టేందుకు 15 రోజుల్లో ప్రణాళికను సమర్పించాలని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌ను ఆదేశించారు. ఈ హత్యలకు సంబంధించిన నిజాలు బాధితుల కుటుంబాలు, అమెరికా ప్రజలకు తెలియజేయాలని, దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా మరో పర్యాయం పని చేయాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకు వీలుగా రాజ్యాంగ సవరణ కోసం అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ చట్టసభ్యుడు ఆండీ ఓగ్లెస్ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ‘డొనాల్డ్ ట్రంప్ మూడో పర్యాయం అధ్యక్షుడిగా పని చేయడానికి ఈ సవరణ వీలు కల్పిస్తుంది’ అని ఈ సందర్భంగా ఆండీ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడిగా ఒక వ్యక్తి రెండు పర్యాయాలకు మించి పని చేయడానికి అవకాశం లేదు.
తాత్కాలికంగా ఆపేసిన కోర్టు
అమెరికాలో జన్మించే వారికి సహజంగా వచ్చే జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశాన్ని అమలు చేయకుండా న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. అధ్యక్షుడి ఉత్తర్వును సవాల్ చేస్తూ పలు రాష్ర్టాలు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జి జాన్ కాఫ్నర్ విచారించారు. ‘ఇది స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమైన ఉత్త ర్వు’ అని ప్రభుత్వ న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 14 రోజుల పాటు అధ్యక్షుడి కార్యనిర్వాహక ఆదేశాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. న్యాయమూర్తి నిర్ణయంపై తన కార్యవర్గం అప్పీల్ చేస్తుందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.