కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం శనివారానికి 24వ రోజుకు చేరింది. రష్యా సైనిక దళాలు దాడులను తీవ్రం చేస్తున్నాయి. మైకోలైవ్‌లో ఉక్రెయిన్ ఆర్మీ బ్యారక్‌ను రష్యా దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో ఉక్రెయిన్ సైనికులు 50 మందికిపైగా మరణించి ఉంటారని తెలుస్తున్నది. రష్యా దాడి సమయంలో ఈ ఆర్మీ బ్యారక్‌లో 200 మందికిపైగా సైనికులు ఉన్నట్లు ఒక ఉక్రెయిన్ సైనికుడు ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపాడు. 50కిపైగా మృతదేహాలను వెలికి తీసినట్లు చెప్పాడు. శిథిలాల కింద ఎంత మంది మరణించి ఉంటారో తెలియదన్నాడు. అయితే సుమారు వంద మంది వరకు మరణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. కాగా, ఉక్రెయిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
మరోవైపు మకారివ్ పట్టణంలో రష్యా మోర్టార్ దాడిలో ఏడుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు. ఇక్కడ జరిగిన రష్యా దాడుల్లో ఏడుగురు పౌరులు చనిపోయినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. కాగా, రష్యా దాడుల్లో ధ్వంసమైన ఉక్రెయిన్ నగరాలను చేరుకోవడం, శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం కష్టంగా ఉందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. రష్యా బలగాలు చుట్టుముట్టిన ఉక్రేనియన్ నగరాల్లో చిక్కుకున్న ప్రజలను సహాయక సంస్థలు చేరుకోలేకపోతున్నాయని యూఎన్‌కు చెందిన ప్రపంచ ఆహార సంస్థ పేర్కొంది. రష్యా సైన్యం చుట్టుముట్టిన లేదా చుట్టుముట్టనున్న ఉక్రెయిన్ నగరాలకు సహాయక సంస్థలు వెళ్లడం సవాల్‌తో కూడుకున్నదని వెల్లడించింది.