కరాచీ: పాకిస్థాన్‌లో మాలిర్ జిల్లా జైలు నుంచి సుమారు 216 మంది ఖైదీలు పరారీ(Jail Break) అయ్యారు. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. భూకంపం రావడంతో జైలు గోడ కూలిపోయింది. దీంతో ఆ జైలు గదుల్లో ఉన్న ఖైదీలు పరారీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం నుంచి భూప్రకంపనలు రావడంతో ఖైదీల్లో ఆందోళన మొదలైంది. అయితే మాలిర్ జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా తుపాకీ శబ్ధాలు వినిపించాయి. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పరారీ అయిన ఖైదీలను పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం 86 మంది ఖైదీలను ఆధీనంలోకి తీసుకున్నారు. జైలు ఏరియాను సీజ్ చేశారు. ఐడెంటీ కార్డు చూపించినవాళ్లను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. సింధ్ ప్రావిన్సు ప్రిజన్స్ శాఖ మంత్రి అలీ హసన్ జర్దారీ.. జైలు బ్రేక్‌కు చెందిన రిపోర్టును కోరారు.
భూ ప్రకంపనలు ఎక్కువైన సమయంలో.. జైలులోని సర్కిల్ నెంబర్ 4, 5 గదుల్లో ఉన్న ఖైదీలను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వివిధ సెల్స్‌లో ఉన్న 600 మంది ఖైదీలు గదుల నుంచి బయటకు వచ్చేశారు. దాంట్లో నుంచి 216 మంది ఖైదీలు పరారీ అయినట్లు చెబుతున్నారు. ఇంకా 135 మంది ఖైదీలు ఆచూకీ చిక్కలేదు. పరారీ అయిన ఖైదీలను గుర్తించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు.
మాలిర్ జైలులో ఎక్కువ శాతం డ్రగ్ సంబంధిత కేసుల్లో చిక్కుకున్న ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఎక్కువ శాతం మానసికమైన సమస్యలతో బాధపడుతుంటారని ఇన్స్పెక్టర్ జనరల్ గులామ్ నబీ మీమన్ తెలిపారు.