మాస్కో: సుమారు 1300 మంది తలదాచుకుంటున్న మారిపోల్లోని డ్రామా థియేటర్‌పై బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో వందలాది మంది మరణించినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే ఈ ఘటన పట్ల రష్యా కొత్త విషయాన్ని చెప్పింది. డ్రామా థియేటర్ నుంచి 200 మందిని రక్షించినట్లు రష్యా మీడియా తెలిపింది. వెయ్యి మందికిపైగా మరణించారన్న వాదనలను రష్యా కొట్టిపరేసింది. శిథిలాల కింద నుంచి సుమారు 200 మంది కంటే ఎక్కువ మందిని కాపాడినట్లు నగర డిప్యూటీ మేయర్ సెర్గీ ఓర్లోవ్ తెలిపారు. డ్రామా థియేటర్‌పై దాడి జరిగిన రోజు తమ సైన్యం ఎటువంటి వైమానిక ఆపరేషన్ చేపట్టలేదని రష్యా మిలిటరీ స్పష్టం చేసింది. తమ టార్గెట్ జాబితాలో ఆ థియేటర్ లేదని కూడా వెల్లడించింది. థియేటర్ బిల్డింగ్‌లో తలదాచుకుంటున్న వారిని అజోవ్ బెటాలియన్‌లోని నాజీ మిలిటెంట్లు బంధించి ఉంటారని రష్యా మిలిటరీ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగర్ కొనషెంకోవ్ తెలిపారు. రష్యాపై నిందలు మోపేందుకే ఆ మిలిటెంట్లు థియేటర్‌పై దాడి చేసి ఉంటారని జనరల్ ఇగర్ ఆరోపించారు.