ఖాట్మండు : పొరుగు దేశం నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు 17 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు శనివారం తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరదలు పోటెత్తుతున్నాయి. వరదలకు తీవ్రంగా ప్రభావితమైన సుదుర్ పశ్చిమ్ ప్రావిన్స్‌లోని అచ్చం జిల్లాలో కొండచరియలు విరిగిపడగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనలో మరో 11 మంది గాయపడ్డారని, మరో ముగ్గురు గల్లంతయ్యారని అధికారులు తెలిపారు.
గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సుర్ఖేత్ జిల్లాకు విమానంలో తరలించారు. ప్రస్తుతం గల్లంతైన వారిని ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడడం కారణంగా ప్రావిన్స్‌లోని ఏడు జిల్లాలను కలిపే భీమ్‌దుట్ట హైవేపై రాకపోకలకు అంతరాయం కలిగింది. అచ్చం కమ్యూనికేషన్ సర్వీస్ కూడా దెబ్బతింది. నేపాల్ పర్వత ప్రాంతాల్లో ముఖ్యంగా జూన్ – సెప్టెంబర్ మధ్య వరదల కారణంగా తరుచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి.