Bashar Al Assad | సిరియాలో తిరుగుబాటుదళాల ఆక్రమణతో అధికారం కోల్పోయిన మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar Al Assad) దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి ఆయన రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. మొన్నటికి మొన్న అసద్ నుంచి భార్య అస్మా అసద్ (Asma Assad) విడాకులు కోరుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా నివేదించిన విషయం తెలిసిందే. తాజాగా అస్మా అసద్ ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్నట్లు తెలిసింది.
అస్మా అల్ అసద్ గత కొంత కాలంగా లుకేమియా (leukaemia)తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రమైనట్లు తెలుస్తోంది. రష్యాలోని రహస్య ప్రదేశంలో ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు పేర్కొంది. ఆమె బతికే అవకాశం 50/50 మాత్రమే ఉందని సదరు కథనాలు నివేదిస్తున్నాయి.
కాగా, అస్మా అల్ అసద్ లుకేమియా బారినపడినట్లు ఈ ఏడాది మేలో అప్పటి సిరియా అధ్యక్ష కార్యాలయం ప్రకటించిన విషయం తెలిసిందే. ‘సిరియా ప్రథమ పౌరురాలు ఆస్మా లుకేమియా బారినపడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది’ అని సిరియా ప్రెసిడెంట్ ఆఫీస్ తన ప్రకటనలో పేర్కొన్నది. లుకేమియా అనేది తెల్లరక్త కణాల్లో వచ్చే ఒక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ అని వెల్లడించింది. కాగా, ఆమె 2019లో రొమ్ము క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఏడాదిపాటు చికిత్స పొందిన అనంతరం కోలుకున్నారు. ఆ తర్వాత నాలుగేళ్లు తిరగకుండానే లుకేమియా బారినపడ్డారు.
అస్మా ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు 1975లో జన్మించారు. అక్కడే పుట్టి పెరిగారు. 2000 సంవత్సరంలో సిరియాకు వచ్చారు. అదే ఏడాది డిసెంబర్లో అసద్‌తో అస్మా వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమె ఆ దేశ మొదటి మహిళగా కొనసాగుతున్నారు. అసద్ – అస్మా జంటకు ముగ్గురు సంతానం.
Also Read..
Bashar Al Assad | రష్యా ఆశ్రయంపై అయిష్టత.. విడాకులు కోరిన సిరియా మాజీ అధ్యక్షుడి భార్య
“Israel | ఆపరేషన్ బషన్ యారో.. సిరియాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్”
“Syria | ముగిసిన అసద్ శకం.. సిరియా రెబల్స్ వశం”