Israel | డమాస్కస్ : బషన్ యారో పేరిట సిరియావ్యాప్తంగా సైనిక ఆపరేషన్ చేపట్టిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు(ఐడీఎఫ్) మంగళవారానికి అసద్ పాలనకు చెందిన 70 నుంచి 80 శాతం ఆయుధ సంపత్తిని ధ్వంసం చేసింది. అసద్ పాలన పూర్తిగా పతనం కావడానికి ముందే ఐడీఎఫ్ చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ రాజకీయ భద్రతా క్యాబినెట్ ఆమోదం తెలపడంతో ఆదివారం రాత్రి నుంచే సిరియాపై సైనిక ఆపరేషన్ ప్రారంభమైంది. ఆదివారం రాత్రి ఐడీఎఫ్‌కు చెందిన 350 వైమానిక దళ విమానాలు సిరియా వైమానిక దళ స్థావరాలపై విరుచుకుపడి విధ్వంసాన్ని సృష్టించాయి.
సిరియా రాజధాని డమాస్కస్ నుంచి దేశంలోని రెండవ అతి పెద్ద పోర్టు నగరమైన టార్టస్ వరకు సాగిన ఈ ఆపరేషన్‌లో 320 వ్యూహాత్మక లక్ష్యాలను ఐడీఎఫ్ విమానాలు ధ్వంసం చేశాయి. మాజీ అధ్యక్షుడు అసద్ సైన్యానికి చెందిన మిగిలిన ఆయుధాలు తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లకూడదన్నదే ఐడీఎఫ్ లక్ష్యంగా కనపడుతోంది. ఈ ఆపరేషన్‌లో ఐడీఎఫ్‌కు చెందిన వందలాది విమానాలు సిరియా గగనతలంపై స్వైరవిహారం చేశాయి. సోమవారం సిరియా నౌకాదళానికి చెందిన రెండు స్థావరాలపై ఇజ్రాయెలీ క్షిపణి నౌకలు ఏకకాలంలో దాడులు జరిపి 15 సిరియన్ నౌకలతోపాటు అనేక క్షిపణులను, ఆయుధాలను ధ్వంసం చేశాయి. అనేక రసాయన ఆయుధాల డిపోలపై కూడా ఐడీఎఫ్ దాడులు జరిపింది.
తిరుగుబాటుదారుల దెబ్బకి దేశాన్ని వదిలి రష్యా పారిపోయిన సిరియా దేశ మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌పై తిరుగుబాటుదారుల కోపం ఇంకా తగ్గడం లేదు. తాజాగా అసద్ తండ్రి, సిరియా మాజీ అధ్యక్షుడు హఫీజ్ సొంత పట్టణంలో ఉన్న ఆయన సమాధికి కొందరు తిరుగుబాటుదారులు నిప్పుపెట్టారు. అసద్‌కు చెందిన అలవైట్ జాతీయులు ప్రధానంగా నివసించే లటకియాలో ఉన్న ఈ సమాధిని ఆగ్రహంతో దగ్ధం చేసి ఉంటారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది.