సిరియాలో ఐదు దశాబ్దాల అసద్ వంశీయుల నిరంకుశ పాలనకు తెరపడింది. తిరుగుబాటు దళాలు రాజధాని డమాస్కస్‌ను చుట్టుముట్టిన వేళ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మాస్కోకు పారిపోయి తలదాచుకున్నాడు. తిరుగుబాటు దళాలు గాల్లోకి కాల్పులు జరుపుతూ సంబురాలు జరుపుకొంటున్నాయి. ఒకప్పటి అల్ కాయిదా నేత అహ్మద్ అల్ శరా తన గతాన్ని, పాత మారు పేరును వదిలించుకొని సిరియా పగ్గాలు చేపట్టారు. ఈ పరిణామాలు అంతర్యుద్ధంతో పదిహేనేండ్ల కాలంపాటు కకావికలమైపోయిన సిరియాకు శాంతిని ప్రసాదించగలవా? లేక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందా అనేదే అసలు ప్రశ్న.
అసద్ ప్రభుత్వ పతనం తర్వాత జరుగుతున్న కొన్ని పరిణామాలు కలిగిస్తున్న ఆందోళనే ఇందుకు కారణం. సందట్లో సడేమియా అన్నట్టుగా ఇజ్రాయెల్ ప్రస్తుత అస్థిర పరిస్థితులను అలుసుగా తీసుకొని దాడులకు తెగబడుతున్నది. సరిహద్దు భూభాగాలను రాత్రికి రాత్రే ఆక్రమించుకుంది. అంతేకాకుండా రసాయనిక ఆయుధ కేంద్రాలు, క్షిపణి స్థావరాలుగా భావిస్తున్న ప్రదేశాలపై బాంబు దాడులకు పాల్పడుతున్నది. అగ్రరాజ్యం అమెరికా ‘నేనేం తక్కువ తిన్నానా’ అన్నట్టుగా ఇస్లామిక్ స్టేట్ శక్తులను దెబ్బతీసే సాకుతో 75 ప్రదేశాలపై బాంబులు వేసింది. ఈ దాడులు ఏ మాత్రం వాంఛనీయమైనవి కావు. ఈ దుందుడుకు చర్యల పర్యవసానాలు ఎలా ఉంటాయో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
అంతర్జాతీయ శక్తుల ప్రచ్ఛన్న యుద్ధానికి సిరియా వేదికగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా అమెరికా, రష్యా, సౌదీ అరేబియా, ఇరాన్ తమ తమ ప్రాబల్యం కోసం సిరియాలో రకరకాల శక్తులను వెనకేసుకు వస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న రష్యా మద్దతు తగ్గించడం వల్లనే అసద్ ప్రభుత్వం పతనమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. షియా-సున్నీ విభేదాలు, రష్యా-అమెరికా తగాదాలకు నెలవుగా మారిన సిరియా బలమైన కేంద్రం అనేది లేకపోవడం కారణంగా ఇప్పుడు జిహాదీ శక్తుల చేతుల్లోకి వెళ్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా శాంతి ఎండమావిగా మారి, అంతర్జాతీయ ఉగ్రవాదం పెచ్చరిల్లేందుకు ఆస్కారం ఉన్నది. ఇది సిరియాకే కాకుండా యావత్తు ప్రపంచానికి సమస్యగా పరిణమించవచ్చు. ఇందుకు మనకు అఫ్గానిస్థాన్, ఇరాక్ ఉదాహరణలు ఉండనే ఉన్నాయి.
అసద్ ప్రభుత్వం కూలిపోవడాన్ని సిరియాలో శాశ్వత శాంతిస్థాపనకు ఒక సువర్ణావకాశంగా ప్రపంచ దేశాలు భావించాలి. 2017లో రష్యా, ఇరాన్, టర్కీ ఆధ్వర్యంలో చేపట్టిన అస్తానా శాంతి చర్చల క్రమాన్ని కొనసాగించాలి. ఉద్రిక్తతలు తగ్గించి, మానవతా సహాయం చేరవేతకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించడం, రాజకీయ చర్చలకు వీలు కల్పించడం అనే త్రిముఖ వ్యూహంతో ఆ చర్చలు మొదలయ్యాయి. 22 విడతల చర్చలు జరిగినా నిర్వాహకులు ప్రత్యర్థి వర్గాలను చెరోవైపున సమర్థిస్తుండటంతో పెద్దగా పురోగతి సాధ్యపడలేదు. అయితే, పరిస్థితి పూర్తిగా నిరాశాజనకంగా ఏమీ లేదు.
సంక్షోభం ముదురుతున్న దశలో మొన్నటి శనివారం మూడు నిర్వాహక దేశాలు ఖతార్ రాజధాని దోహాలో సమావేశమై సిరియాలో కాల్పుల విరమణ, రాజకీయ సంప్రదింపులు, స్వేచ్ఛాయుత ఎన్నికల కోసం ఐక్య రాజ్య సమితి భద్రతామండలి చేసిన 2,254 తీర్మానాన్ని అమలుచేయడంపై ఏకాభిప్రాయానికి రావడం ముదావహం. ఇందుకు సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై పైన తెలిపిన మూడు దేశాలతో పాటుగా ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇరాక్, జోర్డాన్, ఖతార్ సంతకాలు చేశాయి. ఇదే అదనుగా ఐరాస చొరవ తీసుకొని సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు దిశగా కృషిచేయాలి. అంతిమంగా స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు వీలైన పరిస్థితులు కల్పించాలి. ప్రపంచ శాంతికి ప్రజాస్వామిక సిరియా హామీగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.