న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గట్టి హెచ్చరిక చేశారు. ఆయన శుక్రవారం రాజస్థాన్‌లోని అనూప్‌గఢ్ ఆర్మీ పోస్ట్ వద్ద మాట్లాడుతూ, ఉగ్రవాదానికి మద్దతివ్వడం మానుకోవాలని, లేదంటే భౌగోళిక ఉనికిని కోల్పోతారని పాక్‌ను హెచ్చరించారు. ప్రపంచ పటంలో పాకిస్థాన్‌కు స్థానం ఉండాలంటే, అది సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేయడం మానుకోకపోతే ‘ఆపరేషన్ సిందూర్’ రెండోసారి జరుగుతుందని సంకేతాలు పంపించారు. “ఆపరేషన్ సిందూర్ 1.0లో మేం పాటించిన సంయమనాన్ని ఈసారి పాటించేది లేదు. పాకిస్థాన్ భూగోళంలో తన స్థానాన్ని నిలుపుకోవాలని కోరుకుంటున్నదో, లేదో ఆలోచించుకునే విధంగా ఈసారి చేస్తాం” అని ద్వివేది అన్నారు.
సైనికులను ఉద్దేశించి, “భగవంతుడు కోరుకుంటే, త్వరలోనే మీకు అవకాశం వస్తుంది. శుభాకాంక్షలు” అని చెప్తూ, యుద్ధానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. మరోవైపు భారత వాయు సేన చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ, మే నెలలో జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా నాలుగు నుంచి ఐదు పాకిస్థానీ యుద్ధ విమానాలను కూల్చేసినట్లు తెలిపారు. వీటిలో అమెరికాలో తయారైన ఎఫ్-16లు, చైనాలో తయారైన జేఎఫ్-17లు ఉన్నాయని చెప్పారు.
భారత వాయు సేన దినోత్సవం సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన యుద్ధ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఐఏఎఫ్ ఓ రోడ్డుమ్యాపు రూపొందించిందని వెల్లడించారు. భవిష్యత్తులో పాక్ కయ్యానికి కాలు దువ్వితే ఆపరేషన్ సిందూర్ పునరావృతం అవుతుందని హెచ్చరించారు. పాక్‌కు జరిగిన నష్టాలలో రాడార్లు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లు, రన్వేలు, హ్యాంగర్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. గగగనతల రక్షణ వ్యవస్థ సుదర్శన చక్రపై త్రివిధ దళాలు పని ప్రారంభించాయని తెలిపారు.