Operation Herof : పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న ప్రత్యేక ప్రాంతం బలూచిస్తాన్లో ఆ ప్రాంతానికి చెందిన తిరుగుబాటు సంస్థ బీఎల్ఏ (బలూచ్ లిబరేషన్ ఆర్మీ) పాక్ భద్రతా సిబ్బందిపై దాడులకు దిగింది. దీంతో పాక్ పోలీసులు కూడా ఎదురుదాడులకు దిగారు. ఈ కాల్పుల్లో 10 మంది పాక్ పోలీసులు మరణించగా, 37 మంది వరకు బీఎల్ఏ ఉద్యమకారులు మరణించినట్లు తెలుస్తోంది. బలూచిస్తాన్ ప్రాంతంలోని ఐదు జిల్లాలకు చెందిన 12 ప్రదేశాల్లో, ఏకకాలంలో ‘ఆపరేషన్ హీరోఫ్’ పేరుతో బీఎల్ఏ దాడులకు దిగింది.
పాకిస్తాన్ ఆర్మీ, భద్రతా సిబ్బందిపై గన్స్, ఇతర ఆయుధాలతో దాడి చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు దిగింది. క్వెట్టా, మాస్తంగ్, నుష్కి, పస్ని, గ్వాదర్ జిల్లాల్లో బీఎల్ఏ దాడులు చేసింది. దీంతో పాక్ సిబ్బంది కూడా ఎదురు కాల్పులకు దిగి, బీఎల్ఏ దాడుల్ని తిప్పికొట్టారు. దీంతో ఇరువైపులా పలువురు హతమయ్యారు. 10 మంది పాక్ సిబ్బంది, 37 మంది బీఎల్ఏ తిరుగుబాటుదారులు మరణించారు. ఈ దాడులు చేసింది తామేనని బీఎల్ఏ ప్రకటించుకుంది. మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనల్లో సాధారణ ప్రజలు ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని పాక్ సిబ్బంది తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఈ దాడులపై పాక్ అధికారులు స్పందిస్తూ.. బీఎల్ఏ సమన్వయంతో దాడులు చేసినప్పటికీ.. సరైన స్థాయిలో అమలు చేయలేదన్నారు. భద్రతా సిబ్బంది వేగంగా స్పందించడం వల్ల నష్ట తీవ్రత తక్కువగా ఉందని పాక్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో కొన్నేళ్లుగా తిరుగుబాటు ఉద్యమం నడుస్తోంది. పాకిస్తాన్ నుంచి వేరుపడాలని కోరుతూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ దళాలలకు, బీఎల్ఏకు మధ్య నిరంతరం ఘర్షణ కొనసాగుతూనే ఉంది.