న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: అమెరికా, ఇజ్రాయెల్‌తో యుద్ధం సందర్భంగా సముద్ర గర్భంలో అమర్చిన మందు పాతరలను(సీమైన్స్) గుర్తించి, తొలగించడంలో ఇరాన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న కారణంగా హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. సీమైన్స్ని గుర్తించి, తొలగించడానికి ఇరాన్‌కు ఉన్న పరిమిత సామర్థ్యం జలసంధి తిరిగి తెరవకుండా నిరోధిస్తున్న కీలక అంశమని వార్తాకథనం పేర్కొన్నది.
నెల రోజులకు పైగా మూసివేసే ఉన్న హొర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలపై ఆందోళనలను పెంచుతూ భారత్‌తోసహా పలు దేశాలపై ప్రభావం చూపుతున్నది. తాను అమర్చిన అన్ని మందుపాతరల స్థానాలను ఇరాన్ కచ్చితంగా నమోదు చేసి ఉండకపోవచ్చునని అమెరికా అధికారులు అభిప్రాయపడినట్లు పత్రిక తెలిపింది. కొన్ని సందర్భాల్లో వాటి స్థానాలను నమోదు చేసినప్పటికీ ప్రవాహం కారణంగా ఆ మందుపాతరలు కొట్టుకుపోయి ఉండవచ్చు. దీనివల్ల వాటిని గుర్తించి తొలగించడం మరింత కష్టతరం అవుతున్నట్లు అధికారులు తెలిపారు.