న్యూఢిల్లీ, మార్చి 30: త్వరలో ఒప్పందం కుదిరి హొర్ముజ్ జలసంధి తెరుచుకోకపోతే ఇరాన్‌కు చెందిన కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా భారీ దాడులు జరుపుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో హేతుబద్ధమైన పాలనతో జరుపుతున్న చర్చల్లో గొప్ప పురోగతి ఉందని, త్వరలోనే ఒప్పందం కుదరవచ్చని తన ట్రూత్ సోషల్ పోస్టులో ట్రంప్ పేర్కొన్నారు. అయితే శీఘ్రగతిన ఒప్పందం కుదిరి వెంటనే వ్యూహాత్మక జలసంధి వాణిజ్య కార్యకలాపాల కోసం తెరుచుకోకపోతే ఇరాన్‌కు చెందిన విద్యుతుద్పాదన కేంద్రాలు, చమురు బావులు, ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఆయన హెచ్చరించారు.
స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసే డీశాలినేషన్ ప్లాంట్లను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చని, అయితే ఈ సౌకర్యాల జోలికి ఉద్దేశపూర్వకంగా ఇంకా పోలేదని ట్రంప్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ 47 ఏండ్ల భయానక పాలనలో మరణించిన అమెరికా సైనికులకు ప్రతీకారంగా ఈ చర్య ఉంటుందని ట్రంప్ తెలిపారు. కాగా, ఇరాన్‌కు చెందిన మౌలిక వసతులపై దాడులకు ఏప్రిల్ 6 వరకు 10 రోజులపాటు విరామం ఇస్తున్నట్లు ట్రంప్ గతవారమే ప్రకటించారు.
ఈ ప్రకటన తర్వాత ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఇరాన్ చమురు ఎగుమతులకు జీవనాడి అయిన ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని కూడా ప్రకటించడం గమనార్హం. ఖర్గ్ ద్వీపాన్ని మేము స్వాధీనం చేసుకోవచ్చేమో. మాకు అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించారు.