Oil Price : ఇరాన్ ఓడరేవుల (Iran Ports) ను అమెరికా (USA) దిగ్బంధించడంతో చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇరాన్ అణుఒప్పందం చేసుకునే వరకు హర్మూజ్ (Hormuz) దిగ్బంధనం కొనసాగతుందని అమెరికా అధ్యక్షుడు (US President) ట్రంప్ (Trump) పేర్కొనడంతో ముడి చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దాంతో అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ (Crude Oil) బ్యారెల్ ధర 6 శాతం పెరిగి 120 డాలర్లు దాటింది. 2022 తర్వాత చమురు ధరలు ఇంతగా పెరగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గురువారం ఒక దశలో చమురు ధర బ్యారెల్ 125 డాలర్లకు కూడా ఎగబాకింది.
అమెరికా హర్మూజ్‌ను దిగ్బంధించడంతో చమురు ధరలు పెరిగాయని ట్రంప్ యంత్రాంగాన్ని ఉద్దేశించి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ ఘాలిబఫ్ వ్యంగ్యంగా స్పందించారు. మూడు రోజుల్లో ఇరాన్ చమురు బావులు పేలుతాయని ఏప్రిల్ 26న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు చేశారు. ‘మూడు రోజులు అయింది. అలాంటిది ఏమీ జరగలేదు. దానిని 30 రోజులకు పొడిగించి, ప్రత్యక్ష ప్రసారం చేయండి ’ అని ఘాలిబఫ్ ఓ పోస్టులో ఎద్దేవా చేశారు. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్ బెసెంట్ వంటివారు దిగ్బంధనం వంటి సలహాలను ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే చమురు ధర ఒక బ్యారెల్‌కు 120 డాలర్లు దాటింది. నెక్ట్స్ స్టాప్ 140 డాలర్ల వద్ద ఉంటుంది అని రాసుకొచ్చారు.
కాగా దిగ్బంధనాన్ని ఎత్తివేస్తేనే.. హర్మూజ్‌ను తెరుస్తామంటూ ఇరాన్ పట్టుబడుతోంది. అయితే ఆ ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించారు. అతి త్వరలో శత్రు బలగాలపై కొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తామని, అది వారిని తీవ్రంగా భయపెట్టనుందని ఇరాన్ ప్రకటించింది. అది వారి పక్కనే ఉందని, దానితో వారికి గుండెపోటు కూడా రావొచ్చని ఇరాన్ హెచ్చరికలు చేసింది. దాంతో రెండు దేశాల ఘర్షణలు ఏ స్థాయికి చేరుకుంటాయోనని ఆందోళన వ్యక్తమవుతోంది.