Srisailam Temple | శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆక్టోపస్ బృందం శనివారం మాక్ డ్రిల్స్ నిర్వహించింది. శ్రీశైలం క్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ డ్రిల్స్ చేపట్టారు. భద్రతాపరమైన అంశాలపై దేవస్థానం కార్యాలయంలో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ బృందం భద్రతా చర్యలపై వివరించింది. ఆలయ ఈవో శ్రీనివాసరావు, ఆక్టోపస్ విభాగపు డీఎస్పీలు తిరుపతయ్య, సంకురయ్యతో పాటు అధికారులు, తహశీల్దార్ శ్రీనివాసులు, సీఐ జీ ప్రసాదరావు, స్పెషల్ ప్రొటెక్షన్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, విద్యుత్‌శాఖ అధికారులతో పాటు ఆలయ డిప్యూటీ ఈవో ఆర్ రమణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నరసింహారెడ్డి, భద్రతా విభాగపు పర్యవేక్షకులు, ఇన్చార్జి భద్రతా అధికారి ఎం మల్లికార్జున, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో శ్రీనివాసరావు మాట్లాడుతూ దేవస్థానంలో భద్రత విషయంలో తీసుకుంటున్న చర్యలను పీపీటీ ద్వారా వివరించారు.
ఆర్మ్డ్ గార్డ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, హోమ్ గార్డ్స్, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది దేవస్థానంలో అందిస్తున్న సేవలను వివరించారు. వాకీ టాకీలు, డోర్ ఫ్రేమ్స్ డిటెక్టర్ల గురించి తెలియజేశారు. క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్ల నిర్వహణ, మహా శివరాత్రి, ఉగాది ఉత్సవాల్లో అదనపు క్యూ లైన్లు, దేవస్థానం పరిధిలోని పార్కింగ్ ప్రదేశాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ తిరుపతయ్య మాట్లాడుతూ ఆక్టోపస్ విభాగం విధులు, అనుకోని సంఘటనలు జరిగిన సమయంలో ఆక్టోపస్ సిబ్బంది తీసుకునే చర్యలు, భద్రతకు సంబంధించిన చర్యలపై పీపీటీ ద్వారా వివరించారు. డీఎస్పీ సంకురయ్య మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు భద్రతా పరంగా చేపట్టాల్సిన తక్షణ చర్యలపై వివరించారు. అత్యవసర సమయాల్లో దేవస్థానం, స్థానిక పోలీస్‌లు, రెవెన్యూశాఖ, ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖ, టెలీ కమ్యూనికేషన్ విభాగాలన్నీ పరస్పర సమన్వయంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలన్నారు. సీఐ ప్రసాదరావు మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆక్టోపస్ బృందం మాక్ డ్రిల్ నిర్వహించింది.