
ఫొటోను చూసి ఇవేవో వాతావరణంలోకి పొగను వదిలే గొట్టాలు అనుకుంటున్నారా? కానేకాదు. వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ (సీవో2) ను పీల్చుకొనే మెకానికల్ చెట్లు. అవును. అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీటిని రూపొందించారు. 5 అడుగుల వ్యాసంతో ప్రత్యేకమైన రసాయనాలు కలిపిన జిగురు పదార్థాలతో నిండిన డిస్కులను పేర్చి వీటిని నిర్మించారు. గాలిలోని కార్బన్ డైఆక్సైడ్‌ను పీల్చుకొని కిందనున్న ప్రత్యేక గదిలో ఈ చెట్లు దాన్ని స్టోర్ చేస్తాయి. అనంతరం రసాయనిక చర్యల ద్వారా సీవో2ను ఆక్సిజన్‌గా మారుస్తాయి. పర్యావరణ సమతౌల్యం కోసమే వీటిని నిర్మించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెకానికల్ చెట్లతో కూడిన మూడు తోటలను త్వరలో ప్రారంభిస్తామని, ఇవి అందుబాటులోకి వస్తే, రోజుకు వెయ్యి టన్నుల సీవో2ను ఇవి శుద్ధి చేయగలవని తెలిపారు.