సియోల్, నవంబర్ 9: దక్షిణ కొరియాను కవ్వించేందుకు ఉత్తర కొరియా మరో ఎత్తుగడ వేసింది. మొన్నటివరకు చెత్త బెలూన్లను ప్రయోగించిన కిమ్ సర్కార్, తాజాగా జీపీఎస్ సిగ్నల్స్‌ను తారుమారు చేయటాన్ని ఎంచుకుంది. సరిహద్దులో గత రెండు రోజులుగా ఉత్తర కొరియా నుంచి విడుదలవుతున్న జీపీఎస్ సిగ్నల్స్.. దక్షిణ కొరియాకు తలనొప్పిగా మారాయి. దక్షిణ కొరియాకు చెందిన పలు విమాన, నౌకా ప్రయాణాలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. దీనిపై ఆ దేశ మిలటరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తారుమారు చేసిన జీపీఎస్ సిగ్నల్స్‌తో తమ దేశ విమాన సర్వీసులు, పశ్చిమ సముద్రంలో నడుస్తున్న ఓడల ప్రయాణాల్లో సమస్యలు తలెత్తాయని, ఇకనైనా ఈ కవ్వింపు చర్యల్ని ఆపాలని దక్షిణ కొరియా హెచ్చరించింది. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే దానికి ఆ దేశం బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది.