సియోల్ : వెనెజువెలాపై అమెరికా సైన్యం దాడి సంచలనంగా మారిన తరుణంలో ఉత్తర కొరియా ఊహించని షాకిచ్చింది. జపాన్ భూభాగానికి సమీపంలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. ఆదివారం నాడు హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించినట్లుగా ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియా కేసీఎన్ఏ వెల్లడించింది. యుద్ధ నిరోధకతకు సంబంధించి సైనిక కార్యాచరణ సామర్థ్యాన్ని అంచనా వేయడమే ఈ పరీక్షల ముఖ్య ఉద్దేశమని తెలిపింది.
కాగా, ఈ బాలిస్టిక్ కిపణి ప్రయోగాన్ని ఉత్తర కొరియా అధినే కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారు. ఇటీవల భౌగోళిక, రాజకీయ సంక్షోభాలు, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బలమైన అణు నిరోధక శక్తిని కొనసాగించడం, పెంపొందించుకోవడం అత్యంత కీలక వ్యూహమని ఈ సందర్భంగా కిమ్ వ్యాఖ్యానించినట్లుగా కేసీఎన్ఏ తెలిపింది. ఈ క్షిపణులు ఉత్తర కొరియా తూర్పు సముద్ర ప్రాంతంలో సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించినట్లుగా పేర్కొంది. ఈ ప్రయోగాలకు సంబంధించిన వివరాలను అమెరికాతో కలిసి విశ్లేషిస్తున్నట్లు వివరించింది.
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగంపై జపాన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కొరియా ఆదివారం నాడు కనీసం రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని జపాన్ ధ్రువీకరించింది. ఇవి జపాన్ భూభాగంలో పడ్డాయని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి కోయిజుమి తెలిపారు. ఈ మిస్సైల్స్ దాదాపు 950 కి.మీ. వరకు ప్రయాణం చేశాయని పేర్కొన్నారు. అమెరికా, జపాన్ దేశాలకు సంబంధించిన రక్షణ స్థావరాలతో సహా దక్షిణ జపాన్లోని చాలా ప్రాంతాలను అవి చేరగలవని తెలిపారు. ఈ క్రమంలోనే జపాన్ హెచ్చరికలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఉత్తర కొరియా చర్యలు జపాన్కే కాకుండా ప్రపంచానికే బెడదగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతామండలి తీర్మానాలకు లోబడి, బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాలకు స్వస్తి చెప్పాలని దక్షిణ కొరియా సూచించింది. కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు తోడ్పడాలని, తమతో చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చింది.