న్యూఢిల్లీ : రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. యుద్ధం ప్రారంభమై దాదాపు నెల కావొస్తున్నది. ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అణు ముప్పుతో పాటు.. మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీసే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. ఈ క్రమంలో మరో కొత్త ముప్పు ఎదురవుతున్నది. ఉత్తర కొరియా నిషేధిత ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (ICBM)ని గురువారం ప్రయోగించింది. 2017 తర్వాత తొలిసారిగా మిస్సైల్‌ను పరీక్షించిందని దక్షిణ కొరియా తెలిపింది. మిస్సైల్ దాదాపు 1,100 కిలోమీటర్లు దూసుకొచ్చినట్లు జపాన్ అధికారులు అంచనా వేస్తున్నారు.
క్షిపణిని పరీక్షించిన గంట తర్వాత జపాన్ సముద్ర జలాల్లో పడిపోయింది. బాలిస్టిక్ మిస్సైల్ వేల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని, అమెరికా సైతం ఉత్తర కొరియా నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. గత కొన్ని రోజులుగా ఉత్తర కొరియా మిస్సైళ్లను పరీక్షిస్తున్నది. అయితే, ఇందుకు గల కారణాలు తెలియరాలేదు. ఉత్తర కొరియా ఇటీవల కొన్ని ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థకు సంబంధించి పరీక్షలు నిర్వహిస్తుందని అమెరికా, దక్షిణ కొరియా పేర్కొంటున్నాయి.
జపాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం ప్రయోగించిన మిస్సైల్ రేంజ్ 6వేల కిలోమీటర్ల కంటే ఎక్కువగానే ఉంటుందని పేర్కొంటున్నారు. 2017లో మిస్సైల్ పరీక్షలను నిషేధించగా.. ఉత్తర కొరియా పదేపదే ఆంక్షలను ధిక్కరిస్తున్నది. ఉత్తర కొరియా బాలిస్టిక్, అణ్వాయుధాలను పరీక్షించకుండా ఉత్తర కొరియా ఐక్యరాజ్య సమితి నిషేధించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో చర్చల అనంతరం దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, అణు పరీక్షలపై నిషేధం విధించారు. అయితే, 2020లో కిమ్ ఒప్పందంపై కట్టుబడి ఉండనని ప్రకటించారు.