ప్యాంగ్యాంగ్: దేశ పౌరులు నవ్వడం, మద్యం తాగడం, షాపింగ్ చేయడాన్ని ఉత్తర కొరియా తాత్కాలికంగా నిషేధించింది. శుక్రవారం నుంచి 11 రోజులపాటు ఇది అమలులో ఉంటుందని తెలిపింది. మాజీ దేశాధినేత కిమ్ జోంగ్ ఇల్ పదవ వర్థంతి నేపథ్యంలో ఆ దేశ ప్రజలకు ఈ మేరకు ఆంక్షలు విధించింది. ఉత్తర కొరియాను నియంత మాదిరిగా 17 ఏండ్లు పాలించిన కిమ్ జోంగ్ ఇల్ 69 ఏండ్ల వయసులో 2011 డిసెంబర్ 17న గుండెపోటుతో చనిపోయారు. మూడవ, చిన్న కుమారుడైన కిమ్ జోంగ్ ఉన్ నాటి నుంచి ఉత్తర కొరియా పాలన కొనసాగిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 17న వర్థంతి సందర్భంగా తండ్రి స్మారక చిహ్నం వద్ద కిమ్ నివాళులర్పిస్తారు. ఈ నేపథ్యంలో పది రోజులు సంతాప దినాలుగా పాటిస్తారు.
కాగా, ప్రతి ఏటా ఈ సంతాప సమయంలో ప్రజలు మద్యం సేవించకూడదు, నవ్వకూడదు, వినోద కార్యకలాపాలలో పాల్గొనకూడదని ఈశాన్య సరిహద్దు నగరమైన సినుయిజుకు చెందిన ఒక వ్యక్తి రేడియో ఫ్రీ ఆసియాకు తెలిపాడు. ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పాడు. అరెస్ట్ చేయడంతోపాటు నేరస్తులుగా పరిగణిస్తారని, అలాంటి వ్యక్తులు ఇక తిరిగి కనిపించరని ఆ వ్యక్తి పేర్కొన్నాడు.