సియోల్: తమ దేశంతో ఉన్న సరిహద్దును దాటే రోడ్ల వద్ద భారీగా సైన్యం మోహరించి ఆ రోడ్లను పేల్చేసేందుకు ఉత్తర కొరియా సిద్ధమవుతున్నదని దక్షిణ కొరియా సోమవారం ఆరోపించింది. తమ రాజధాని ప్యాంగాంగ్పైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపిందని ఉత్తర కొరియా ఆరోపించిన తర్వాత ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఉత్తర కొరియా దళాలు రోడ్లను పేల్చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయని దక్షిణ కొరియా సైన్య ప్రతినిధి చెప్పారు.
దక్షిణ కొరియాతో అనుసంధానం ఉన్న రైలు, రోడ్లను పూర్తిగా కట్ చేసి సరిహద్దు ప్రాంతాలను పటిష్ఠం చేస్తామని గత వారం ఉత్తర కొరియా సైన్యం తెలిపింది. మరోసారి ప్యాంగాంగ్ పైన దక్షిణ కొరియా డ్రోన్లు కనిపిస్తే భయంకరమైన విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తర కొరియా హెచ్చరించింది. సరిహద్దుల్లో కాల్పుల కోసం ఎనిమిది సైనిక యూనిట్లను సిద్ధంగా ఉంచింది.