Nobel Prize | స్టాక్హోమ్: మైక్రోఆర్ఎన్ఏను కనుగొన్న అమెరికా శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రవ్కున్కు వైద్య శాస్త్రంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం లభించింది. సోమవారం నోబెల్ కమిటీ ఈ అవార్డును ప్రకటించింది. జన్యు క్రియను క్రమబద్ధీకరించే ప్రాథమిక సూత్రం మైక్రో ఆర్ఎన్ఏనే అనే విషయాన్ని వీరు గుర్తించారు. జీవులు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా పని చేస్తాయనే ప్రాథమిక అంశాన్ని వీరి ఆవిష్కరణ నిరూపించిందని నోబెల్ అసెంబ్లీ ప్రకటించింది. విక్టర్ ఆంబ్రోస్ అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్లో నాచురల్ సైన్స్ ప్రొఫెసర్గా పని చేస్తున్నారు. రవ్కున్ హార్వర్డ్ మెడికల్ స్కూల్లో జెనెటిక్స్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి 10 లక్షల డాలర్ల(రూ.84 కోట్లు) నగదు బహుమతి అందనుంది. డిసెంబర్ 10న ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి సందర్భంగా వీరు అవార్డు అందుకోనున్నారు. వీరితో వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకున్న వారి సంఖ్య 227కు చేరుకోనుంది. కాగా, కొవిడ్-19కు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లు అభివృద్ధి చేసిన అమెరికన్ శాస్త్రవేత్త డ్రూ వెయిస్మెన్, హంగేరీ అమెరికన్ కటలిన్ కరికోకు గత ఏడాది మెడిసిన్లో నోబెల్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే.
జన్యు క్రియను నియంత్రించడంతో కీలక పాత్ర పోషించే సూక్ష్మ ఆర్ఎన్ఏ అణువులను ఆంబ్రోస్, రవ్కున్ కనుగొన్నారు. వీరి ఆవిష్కరణ జన్యు నియంత్రణలో కొత్త సిద్ధాంతాన్ని తెలిపింది. ప్రొటీన్ల తయారీ సూచనలను కలిగి ఉండే మెసెంజర్ ఆర్ఎన్ఏకు మైక్రోఆర్ఎన్ఏ భిన్నమైనవి. నిర్దిష్ట ఎంఆర్ఎన్ఏ అణువులు ప్రొటీన్లుగా పరివర్తన చెందకుండా మైక్రో ఆర్ఎన్ఏ నియంత్రిస్తాయి. కణాల అభివృద్ధి, జీవక్రియలోనూ మైక్రోఆర్ఎన్ఏ కీలకపాత్ర పోషిస్తాయి. మైక్రోఆర్ఎన్ఏ పనితీరులో ఆటంకాలకు క్యాన్సర్ వంటి వ్యాధులతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కణాల మధ్య భేదాన్ని కనుగొనడం, వాటి అభివృద్ధి, వ్యాధి ప్రక్రియలను మరింత మెరుగ్గా అర్థం చేసుకోవడంలో మైక్రో ఆర్ఎన్ఏ ఉపయోగపడనుంది.