ఢాకా, ఆగస్టు 6: షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్‌లో మొదలైన రాజకీయ సంక్షోభం తాత్కాలికంగా కొలిక్కి వచ్చింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూనస్‌ను నియమిస్తూ దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంగళవారం ఆర్థరాత్రి అధ్యక్షుడి ప్రెస్ సెక్రటరీ ప్రకటన చేశారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం నడిపిన ‘స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్’ ప్రతినిధులు మహమ్మద్ యూనస్ పేరును కొత్త ప్రభుత్వాధినేతగా ప్రతిపాదించారు. దేశంలో సైనిక పాలనను, సైనిక మద్దతు ఉండే ప్రభుత్వాన్ని, నియంత పాలనను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ‘స్టూడెంట్స్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్’ జాతీయ సమన్వయకర్త నహీద్ ఇస్లాం మంగళవారం ప్రకటించారు. విద్యార్థులు ప్రతిపాదించిన ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
యూనస్ వైపు విద్యార్థుల మొగ్గు
ఆర్థికవేత్త మహమ్మద్ యూనస్(84) సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని విద్యార్థి నేతలు మంగళవారం డిమాండ్ చేశారు. తాము యూనస్‌తో మాట్లాడామని, ప్రభుత్వాన్ని నడిపించేందుకు ఆయన అంగీకరించారని విద్యార్థి నేత నహీద్ ఇస్లాం ప్రకటించారు. ప్రస్తుతం యూనస్ విదేశాల్లో ఉన్నారు. యూనస్‌కు పాలన అందించేందుకు సైన్యాధ్యక్షుడు ఉజ్జమాన్ అంగీకరిస్తారా అనే అనుమానం మొదట తలెత్తింది. ఒకవేళ అంగీకరించకపోతే ప్రభుత్వ ఏర్పాటుపై విద్యార్థులు, సైన్యం మధ్య పేచీ మొదలవుతుందని అంతా అనుకున్నారు. అయితే, ఈ అవకాశం ఇవ్వకుండా మహమ్మద్ యూనస్నే తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు ఎంపిక చేశారు.
బంగ్లా పార్లమెంటు రద్దు
బంగ్లాదేశ్ పార్లమెంటు(జాతీయ సంసద్)ను రద్దు చేస్తున్నట్టు దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్ మంగళవారం ప్రకటించారు. హసీనా రాజీనామా అనంతర పరిణామాలపై సోమవారం రాత్రి ఆయన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ అధినేతలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థి ఉద్యమ నేతలతో సమావేశమై చర్చించారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు షహాబుద్దిన్ అనుమతి తెలిపారు. మళ్లీ ఎన్నికలు జరిపేందుకు వీలుగా పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు చెప్పారు.
భయం గుప్పిట బంగ్లా హిందువులు
షేక్ హసీనా రాజీనామా తర్వాత బంగ్లాదేశ్‌లో హిందువులను అల్లరిమూకలు లక్ష్యంగా చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా 27 జిల్లాల్లో సోమవారం హిందువుల ఇండ్లు, వ్యాపారాలపై మూకలు దాడికి పాల్పడి, లూటీ చేసినట్టు స్థానిక మీడియా తెలిపింది. అనేక హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. మెహెర్పూర్లోని ఇస్కాన్ ఆలయం, కాళీమాత ఆలయానికి దుండగులు నిప్పు పెట్టారు. ఇస్కాన్ ఆలయానికి నిప్పుపెట్టినప్పుడు అక్కడ ఉన్న ముగ్గురు భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ఇస్కాన్ అధికార ప్రతినిధి యుధిస్తిర్ గోవిందదాస్ తెలిపారు. రంగ్‌పూర్ నగర కార్పొరేషన్లో కౌన్సిలర్‌గా ఉన్న హరధన్ రాయ్‌ను దుండగులు హత్య చేశారు. దేశవ్యాప్తంగా హిందువులకు చెందిన 54 ఆలయాలు, ఇండ్లు, ఆస్తులపై దాడులు జరిగాయని బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ తెలిపింది.
బెంగాల్‌కు కోటి మంది హిందువులు: సువేందు అధికారి
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరుగుతుండటంతో, హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాతే ఇస్లామీ బలపడే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున హిందువులు భారత్‌కు శరణార్థులుగా వచ్చే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితులు అదుపులోకి రాకపోతే కోటి మంది బంగ్లాదేశీ హిందువులు బెంగాల్‌కు వచ్చే అవకాశం ఉందని, వారికి ఆశ్రయం ఇచ్చేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని బీజేపీ నేత, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేర్కొన్నారు.
ఆర్మీ చీఫ్‌పై ముందే భారత్ హెచ్చరిక
బంగ్లాదేశ్‌లో నిరసనకారులకు ఆర్మీ తెరవెనుకుండి మద్దతు పలికిందన్న మాటలు వినిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ వ్యవహారశైలి వివాదాస్పదంగా మారింది. ఈ ఏడాది జూన్ 23న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్‌గా ఆయన నియమితులయ్యారు. అయితే ఎంపికకు ముందే.. అతడి గురించి ప్రధాని షేక్ హసీనాను భారత్ హెచ్చరించినట్టు సమాచారం. అతడు చైనా అనుకూల వ్యక్తి. అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలని భారత జాతీయ భద్రతా మండలికి చెందిన కొందరు ఉన్నతాధికారులు హసీనాను అప్రమత్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయినప్పటికీ హసీనా ప్రభుత్వం అతడి నియామకానికే మొగ్గుచూపింది.
న్యూయార్క్‌లోని బంగ్లా రాయబార కార్యాలయంపై దాడి
న్యూయార్క్‌లోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంపై కూడా కొందరు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోయి వస్తువులను ధ్వంసం చేశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. షేక్ హసీనా తండ్రి, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిత్రపటాన్ని తొలగించారు.
‘పేదల బ్యాంకర్’ మహమ్మద్ యూనస్
అమెరికాలోని వాండెర్‌బిల్ట్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసిన మహమ్మద్ యూనస్(83) బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ యూనివర్సిటీలో అధ్యాపకుడిగా పని చేశారు. 1983లో ఆయన ప్రారంభించిన గ్రామీణ్ బ్యాంకు బంగ్లాదేశ్ ఆర్థిక ప్రస్థానంలో కీలక భూమిక పోషించింది. గ్రామీణ మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు రూ.2 వేల నుంచి ఈ బ్యాంకు రుణాలు ఇచ్చింది. వేలాది కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేందుకు ఈ బ్యాంకు ఉపయోగపడింది. దీంతో యూనస్‌కు ‘పేదల బ్యాంకర్’గా పేరు దక్కింది. ఆయన ప్రారంభించిన గ్రామీణ బ్యాంకు తరహాలో దాదాపు 100 దేశాల్లో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రారంభమయ్యాయి. 2006లో యూనస్‌కు నోబెల్ బహుమతి దక్కింది. 2007లో బంగ్లాదేశ్ రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించిన యూనస్ సొంత పార్టీని స్థాపిస్తానని ప్రకటించి తర్వాత వెనక్కుతగ్గారు. కాగా, ఆయనకు చెందిన గ్రామీణ్ టెలికం అనే కంపెనీలో కార్మిక సంక్షేమ నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జనవరిలో ఆయనను అరెస్టు చేయగా బెయిల్‌పై బయటకు వచ్చారు.
జైలు నుంచి విడుదలైన ఖలీదా
2018లో అవినీతి ఆరోపణలతో అరెస్టయి జైలు జీవితం గడుపుతున్న ఖలీదాను విడుదల చేయాల్సిందిగా దేశ అధ్యక్షుడు షహాబుద్దిన్ ఆదేశాలు ఇచ్చారు. షేక్ హసీనా రాజీనామా చేసిన గంటల్లోనే షహాబుద్దిన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఖలీదా జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం ఖలీదా నేతృత్వంలో బీఎన్పీ ర్యాలీ నిర్వహించనుంది. బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షుడు జియావుర్ రెహ్మాన్ సతీమణి అయిన ఖలీదా జియా 1991 – 96, 2001 – 06 వరకు రెండు పర్యాయాలు బంగ్లాదేశ్ ప్రధానిగా పని చేశారు. ఆ దేశ తొలి మహిళా ప్రధాని అయిన ఖలీదా.. మాజీ ప్రధాని షేక్ హసీనాతో సుదీర్ఘ రాజకీయ పోరాటం చేశారు.