Maria Corina Machado | ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize 2025) వెనెజువెలా (Venezuela) దేశానికి చెందిన మరియా కొరీనా మచాడో (María Corina Machad) దక్కిన విషయం తెలిసిందే. నేడు నార్వే రాజధాని ఓస్లో (Oslo)లో నోబెల్ పురస్కార ప్రదానోత్సవం జరగనుంది. అయితే, ఈ వేడుకకు మరియా కొరీనా వెళ్తారా..? లేదా..? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా దేశం దాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా (To Be Declared Fugitive) ప్రకటిస్తామని వెనెజువెలా అటార్నీ జనరల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రదానోత్సవ కార్యక్రమానికి మరియా వెళ్తారా.. లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు నోబెల్ ప్రదానోత్సవం జరగనుంది. దీనికి ముందు ఓస్లోలో నిర్వహించే మీడియా సమావేశానికి శాంతి బహుమతి విజేత మరియా కొరీనా గైర్హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశాన్ని నిర్వాహకులు రద్దు చేశారు. మరోవైపు ఈ కార్యక్రమానికి మరియా కొరీనా హాజరుపై తమకు స్పష్టతలేదని నిర్వాహకులు తెలిపారు. ఈ బహుమతి అందుకోడానికి ఆమె వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
2025 నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) వెనెజువెలా ప్రధాన ప్రతిపక్ష నాయకురాలు, ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న మరియా కొరీనా మచాడోకు (Maria Corina Machado) నోబెల్ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం విశేషంగా కృషి చేసిన మచాడో వెనెజువెలా ఉక్కు మహిళగా కూడా పేరుపొందారు. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన ప్రపంచంలోని అత్యంత పలుకుబడిగల 100 మంది ప్రముఖుల జాబితాలో కూడా ఆమె చోటు దక్కించుకున్నారు. గత ఏడాది జరిగిన వెనెజువెలా పార్లమెంట్ ఎన్నికలలో భారీ స్థాయిలో రిగ్గింగ్ జరిగి ప్రస్తుత అధ్యక్షుడు నికొలస్ మదురో గెలుపొందిన తర్వాత 58 ఏళ్ల మచాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
శాంతి బహుమతి ప్రకటన చేస్తూ నోబెల్ కమిటీ మచాడోని వెనెజువెలా ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన వ్యక్తిగా అభివర్ణించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య మార్పిడి కోసం శాంతియుతంగా పోరాడిన యోధురాలిగా ఆమెను పేర్కొంది. చీకటి ముసురుకుంటున్న సమయంలో ప్రజాస్వామ్య జ్యోతిని ఆరిపోకుండా వెలిగిస్తున్న ధైర్యవంతురాలైన శాంతికాముకురాలిగా మచాడోని నోబెల్ కమిటీ అభివర్ణించింది. వెనెజువెలాలో మదురో నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా అనేక ఏళ్లుగా సాగుతున్న ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమానికి ఆమె సారథ్యం వహిస్తున్నారు. ఆమె బెదిరింపులను ఎదుర్కోవడమే కాక అరెస్టు కూడా అయ్యారు.
ప్రయాణ నిషేధాలను, రాజకీయ వేధింపులను ఎన్నో ఎదుర్కొన్నారు. ఇన్ని కష్టాలను తట్టుకుని కూడా ఆమె వెనెజువెలాలోనే ఉండి ఉక్కు మహిళగా గుర్తింపు పొందారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ చేయకుండా నిషేధం విధించారు. తమదే నిజమైన విజయమని ప్రతిపక్షం ప్రకటించుకున్నప్పటికీ మదురో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రతిపక్షాన్ని అణచివేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలతో మచాడో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో పట్టభద్రురాలైన మచాడో 2013లో సహవ్యవస్థాపకురాలిగా వెంటే వెనెజువెలా పేరిట ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి దాని జాతీయ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.
Also Read..
“ప్రజాస్వామ్య గోంతుకకు శాంతి బహుమతి”
“Nobel Prize | ‘నోబెల్’ గ్రహీతలకు ఎంత ప్రైజ్మనీ వస్తుందో తెలుసా.. ఆసక్తికర విశేషాలు మీకోసం..”
“María Corina Machad | నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడికి అంకితమిస్తున్నా.. ఎందుకంటే..?”