‘నా దేశ అభివృద్ధి బుల్లెట్లతో కాదు, బ్యాలెట్లతో జరగాలి’ అని ఆకాంక్షించారామె. పారదర్శక ఎన్నికలే తమ దేశాన్ని ప్రగతి పథంలో నడుపుతాయని నమ్మారు. అందుకోసమే పోరు సలిపారు.పర్యవసానంగా… అణచివేత, నిర్బంధం, బెదిరింపు… ఈ మూడుపదాలు ఆమె జీవితంలోని ప్రతి పేజీలోనూ కనిపిస్తాయి. అయినా, ఆమె భయపడలేదు. శాంతియుత పోరాటమే ఆయుధంగా ముందుకుకదిలారు. ఆవిడే వెనెజులా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ ఉద్యమ కారిణి మరియా కొరీనా మచాడో. ఆమె కృషికి గాను ఈ ఏడాది ప్రఖ్యాత నోబెల్శాంతి పురస్కారానికిఎంపికయ్యారు. ఆ పోరాటం గురించి కొన్ని సంగతులు…
పేరుకు ప్రజాస్వామ్య దేశాలే అయినా నియంతృత్వ పోకడలతో సాగుతున్న వాటి జాబితాలో వెనెజులా కూడా ఉంటుంది. ఎన్నికల ప్రక్రియలో కుతంత్రాలకు పాల్పడి మళ్లీ మళ్లీ గద్దెనెక్కే ఘనమైన నేతలున్న ప్రపంచమిది. తమ అధికారాన్ని ప్రశ్నించిన వారిని అణచివేసే అలవాటున్న పాలకులు అక్కడా తిష్టవేసుక్కూర్చున్నారు. మాటలు కాదు ఏకంగా తూటాలతోనే బెదిరించే అలవాటు వారిది. అలాంటి చోట ఓ స్త్రీ గొంతుక నియంతృత్వ ప్రభుత్వాల తుపాకీ చప్పుడును కమ్మేసింది. సామాజిక సాధనాల సాయంతో యువతను మేల్కొలిపింది. అందుకే మరియా కొరీనా మచాడో అక్కడో విప్లవ స్వరం. వెనెజులాలో ఓట్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు ఓ స్వచ్ఛంద సంస్థను కూడా నెలకొల్పారామె. ఈ పోరు కోసం ఆమె ఎంచుకున్నది మాత్రం అచ్చం మన గాంధీజీలా శాంతి మార్గమే!
ఇంజినీరింగ్ చదివి…
1967 అక్టోబరు 7న వెనెజులాలోని కారకస్ నగరంలో ఉన్నత కుటుంబంలో పుట్టారు మచాడో. తండ్రి పారిశ్రామికవేత్త కాగా, తల్లి సైకియాట్రిస్ట్. అందుకే ఆమెలో నాయకత్వం, బాధ్యత, సహానుభూతిలాంటి గుణాలు కలగలుపుగా కనిపిస్తాయి. చదువుల్లో ముందుండే ఆమె, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్లో పట్టభద్రురాలు అయ్యారు. తర్వాత ప్రముఖ బిజినెస్ స్కూల్ నుంచి స్నాతకోన్నత విద్య, యేల్ యూనివర్సిటీ ఫెలోషిప్ పూర్తి చేశారు. అయితే ఆమె మనసు మాత్రం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణవైపే ఉండేది. ఆ దిశగానే ఆమె ఆలోచనలు సాగేవి. ఎందుకంటే ఆ దేశంలో నామమాత్రపు ప్రజాస్వామ్యమే గద్దె మీద ఉండేది.
ఓటు హక్కును పవిత్రమైనదిగా చెబుతారామె. ప్రజాస్వామ్యపు పునాది అయిన దీని పరిరక్షణకు తన జీవితాన్ని అంకితం చేశారు. తన ఆశయ సాధన కోసం 2002 సంవత్సరంలో ‘సుమాతే’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. వెనెజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ సంస్థ. దీని ద్వారా పౌరహక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఓట్ల ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు కృషి చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను బలపరచడానికి తోడ్పడ్డారు. సోషల్ మీడియా, కమ్యూనిటీ మీటింగుల ద్వారా యువతను జాగృత పరిచారు. ఆమె శ్రమతో వేలాది మంది వలంటీర్లు ఎన్నికల పర్యవేక్షణలో పాల్గొన్నారు. ‘అధికారాన్ని కాదు, న్యాయాన్ని గెలుచుకుందాం’ అంటూ ఆమె సలిపిన పోరు ప్రపంచ ప్రశంసల్ని అందుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించడంలో ‘సుమాతే’ విజయవంతమైంది.
దాదాపు దశాబ్దం పాటు ఈ సంస్థతో కలిసి పనిచేసిన తర్వాత ఆమె ‘వెంటే వెనెజులా’ పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించారు. 2010లో ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థిగా చరిత్ర సృష్టించి తొలిసారి చట్ట సభలో అడుగు పెట్టారు. అధికార పార్టీ వ్యతిరేక పోరాటాల ఫలితంగా ఒకానొక దశలో తన అసెంబ్లీ సభ్యత్వాన్ని కోల్పోయారామె. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆంక్షలనూ ఎదుర్కొంటున్నారు. అయినా వెనుదిరగలేదు. ఆమెపై మోపిన ఆంక్షల కారణంగా గత కొంత కాలంగా అజ్ఞాతవాసంలో ఉంటూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు.
ప్రస్తుతం వెనెజులా ప్రతిపక్షనేత హోదాలో ఉన్న మచాడో తన శాంతి పథం నుంచి ఎప్పుడూ తప్పుకోలేదు. ఐక్యరాజ్య సమితి, యూరోపియన్ పార్లమెంట్ వంటి వేదికల్లో ప్రజాస్వామ్య రక్షణపై తన గొంతుకను వినిపించారు. టైమ్స్ జాబితాలో చోటుతోపాటు వాక్లేవ్ హావెల్ హ్యుమన్ రైట్స్ ప్రైజ్(2024), గ్లోబల్ డెమోక్రసీ లీడర్ అవార్డు (2024) లాంటి పురస్కారాలెన్నో అందుకున్నారు. ధైర్యం, నిజాయతీ, శాంతియుత పోరాటం… ఈ మూడు కలిస్తే మార్పు తప్పక వస్తుందని నమ్మే కొరీనా మచాడో.. నోబెల్ శాంతి పురస్కారాన్ని అందుకోవడం ప్రజాస్వామ్య
ప్రపంచానికి శుభసూచకం.
శాంతి గెలుపు కాదు. అది మనసులోని ఒక దీపం. దాన్ని వెలిగించడానికి ధైర్యం కావాలి.మరియా కొరినా మచాడో