India at UN : రష్యా – ఉక్రెయిన్ (Russia – Ukraine) దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో రెండు వైపులా ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సామాన్య పౌరులు కూడా అసువులుబాసారు. ఈ యుద్ధానికి ముగింపు పలికేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే ఏ చర్యకైనా తమ మద్దతు ఉంటుందని ఐక్యరాజ్యసమితి (United Nations) లో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ చెప్పారు.
ఉక్రెయిన్ పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతోందని హరీశ్ తెలిపారు. యుద్ధం కారణంగా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం సరి కాదన్నారు. యుద్ధ భూమిలో సమస్యలకు పరిష్కారాలు లభించవని ఆయన ఉద్ఘాటించారు. సంఘర్షణను ఆపేందుకు జరిగే అన్ని ప్రయత్నాలకు భారత్ పూర్తిగా మద్దతిస్తుందని పేర్కొన్నారు. దౌత్యపరమైన మార్గాల్లోనే యుద్ధం ముగుస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు. ఇటీవల ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
యుద్ధం విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య ఇటీవల అలాస్కా వేదికగా జరిగిన సమావేశాన్ని కూడా హరీశ్ ప్రస్తావించారు. వాషింగ్టన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో, యూరోపియన్ నేతలతో ట్రంప్ మాట్లాడిన విషయాన్ని కూడా గుర్తుచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ అంశంపై పుతిన్, జెలెన్స్కీలతోపాటు యూరోపియన్ నేతలతో మాట్లాడినట్లు వెల్లడించారు. ఈ ప్రయత్నాలన్నీ ఫలించి కీవ్‌లో తిరిగి శాశ్వత శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నామని చెప్పారు.