హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald trump) ఏకపక్ష విధానాలపై అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి కారణం లేకుండానే ఇరాన్‌పై యుద్ధానికి(Iran war) దిగడం, ట్రంప్ తీసుకున్న వలస విధానాలు వంటి వాటిపై అమెరికాలో గతంలో ఎన్నడులేని విధంగా భారీగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ‘నో కింగ్స్’(No Kings movement )అంటూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మొత్తం 50 రాష్ట్రాల్లో 3,100 నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ నిరసనల్లో సుమారు 90 లక్షల వరకు ప్రజలు పాల్గొంటారని, అమెరికా చరిత్రలోనే ఇది అతి పెద్ద నిరసన అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే మిన్నెసోటాలోని కాలిపట్ లాన్‌కు ప్రజలు భారీగా చేరుకొని ‘నో కింగ్స్’ ప్లకార్డులను ప్రదర్శిస్తూ ట్రంప్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికార మార్పిడి స్వదేశం నుంచే మొదలవ్వాలని నినదించారు. అమెరికా సైనికులు అమ్మకానికి లేరన్నారు. వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యూయార్క్‌లో జరిగిన నిరసన ప్రదర్శనలో నటుడు రాబర్ట్ డినిరో పాల్గొన్నారు.
మరోవైపు ఐరోపా, లాటిన్ అమెరికా ఖండాల్లో కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఐరోపాలో నివసిస్తున్న అమెరికన్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా ర్యాలీలు చేపట్టారు. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరిగిన నిరసనల్లో వందలాది మంది పాల్గొన్నారు. ఇటలీలోని రోమ్ నగరంలో జరిగిన నో కింగ్స్ ర్యాలీలో వేలాది మంది పాల్గొన్నారు. ఇరాన్‌పై దాడులను ఖండించారు. కాగా, నో కింగ్స్ నిరసనలకు ప్రజల మద్దతు లేదని వైట్‌హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. వామపక్ష ఆర్థిక సాయంతో నిరసనలు కొనసాగుతున్నాయని ఆరోపించింది.